నెంబర్‌ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు | CyberCriminals Committing Sim Swapping | Sakshi
Sakshi News home page

నెంబర్‌ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు

Published Thu, Jun 23 2022 7:38 AM | Last Updated on Thu, Jun 23 2022 9:46 AM

CyberCriminals Committing Sim Swapping - Sakshi

సాక్షి, హైదరాబాద్:  చీటికి మాటికీ మీ సిమ్‌ కార్డ్‌కు నెట్‌వర్క్‌ సమస్య వస్తోందా? ఫోన్‌ కాల్, మెసేజ్‌లు అస్సలు చేయలేకపోతున్నారా? ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీ సిమ్‌ బ్లాక్‌ అయ్యిందా?.. అయితే మీరు సైబర్‌ నేరస్తుల వలలో పడినట్టే ! ఆలస్యం చేయకుండా వెంటనే మీ టెలికం సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించండి. ఎందుకంటే ఈమధ్య కాలంలో సైబర్‌ నేరస్తులు నకిలీ గుర్తింపు పత్రాలు సమర్పించి.. మీ నంబర్‌తో కొత్త సిమ్‌ కార్డ్‌లను పొందుతున్నారు.

ఇటీవల సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ‘నకిలీ వేలి ముద్రలు’ కేసులో అరెస్ట్‌ చేసిన నిందితుల ముఠా సిమ్‌ కార్డ్‌లు, బ్యాంక్‌ ఖాతాలు సమీకరించింది ఇలాగే !  ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్ల కస్టమర్ల ఫోన్‌ నెంబర్లను సైబర్‌ నేరస్తులు టార్గెట్‌ చేస్తున్నారు. నెట్‌వర్క్‌ సమస్యలు వస్తున్నాయని బాధితులు సర్వీస్‌ ప్రొవైడర్లకు ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోయాయి. నకిలీ గుర్తింపు కార్డ్‌లను సమర్పించడంతో సర్వీస్‌ ప్రొవైడర్‌ కొత్త సిమ్‌ కార్డ్‌ జారీ చేస్తున్నారు. దీంతో అసలు యజమాని మొబైల్‌లో ఉన్న సిమ్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అవుతుంది. కొన్ని గంటల్లోనే నేరస్తుడి సెల్‌ఫోన్‌లో ఉన్న కొత్త సిమ్‌ కార్డ్‌ యాక్టివేట్‌ అవుతుంది.  

ఎలా చేస్తారంటే? 
కస్టమర్లు స్టోర్‌ను సందర్శించినప్పుడు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) ఏజెంట్‌ డిజిటల్‌ కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) ద్వారా సిమ్‌ కార్డ్‌ను యాక్టివేట్‌ చేస్తాడు. కానీ, డిజిటల్‌ కేవైసీ ఫెయిలయిందని కస్టమర్‌కు చెప్తాడు. తర్వాత ఈ–కేవైపీ పద్ధతి ద్వారా కస్టమర్‌ పేరు మీద మరొక సిమ్‌ కార్డ్‌ను యాక్టివేట్‌ చేస్తాడు. ఇలా ఒక్క కస్టమర్‌ పేరు మీదనే రెండు సిమ్‌ కార్డ్‌లను యాక్టివేట్‌ చేస్తారు.

డిజిటల్‌ కేవైసీ ద్వారా యాక్టివేట్‌ చేసిన సిమ్‌ కార్డ్‌ కస్టమర్‌కు, ఈ–కేవైసీ ద్వారా యాక్టివేట్‌ చేసిన సిమ్‌ కార్డ్‌ను నేరస్తులకు చేరవేస్తుంటారు. నకిలీ వేలి ముద్రల కేసులో ఒంగోలుకు చెందిన విశ్వనాథుల అనిల్‌ కుమార్‌ ఇలాగే కస్టమర్ల పేర్ల మీద 121 సిమ్‌ కార్డ్‌లను యాక్టివేట్‌ చేసి.. ఈ కేసులో ఏ–4 ఒంగోలుకు చెందిన దర్శనం సామేలు చేరవేశాడు. ఇతడు కమీషన్‌ రూపంలో ఈ సిమ్‌ కార్డ్‌లను ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లుకు సరఫరా చేశాడు. 

అకౌంట్‌లోని నగదు లూటీ.. 
ఒరిజినల్‌ సిమ్‌ కార్డ్‌ను నేరస్తులు స్వాపింగ్, క్లోన్‌ చేస్తున్నారు. దీంతో అప్పటికే మీ సిమ్‌ కార్డ్‌లో సేవ్‌ అయి ఉన్న కాంటాక్ట్, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం నేరస్తుల చేతిలోకి వెళ్లిపోతుంది. బ్యాంక్‌ ఖాతాలను కూడా ఆపరేట్‌ చేస్తున్నారు. బాధితుడు ఆ సమయంలో మొబైల్‌ సేవలను వినియోగించలేడు కాబట్టి బ్యాంక్‌ వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) కూడా కొత్త సిమ్‌ కార్డ్‌ వినియోగిస్తున్న నేరస్తుడికే వెళ్లిపోతుంది. దీంతో అకౌంట్‌లోని నగదును నిందితుల బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసుకుంటారు. ఈ వ్యవహారంలో నిందితులు సమర్పించే గుర్తింపు కార్డ్‌లు, నగదు బదిలీ జరిగే బ్యాంక్‌ ఖాతాలు అన్నీ నకిలీవే ఉంటున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది.  

ఒకే రోజు రెండు సిమ్‌లు జారీ చేయొద్దు 
సిమ్‌ కార్డ్‌ల జారీలో టెలికం విభాగం అప్రమత్తంగా ఉండాలి. ఒకే రోజు వేర్వేరు కేవైసీ పద్ధతులతో రెండు సిమ్‌ కార్డ్‌లను యాక్టివేషన్‌ చేయకూడదు. అలాగే సిమ్‌ కార్డ్‌లు తీసుకునే సమయంలో కస్టమర్లు వాటిని దృవీకరించుకోవాలి. 
– స్టీఫెన్‌ రవీంద్ర, పోలీస్‌ కమిషనర్, సైబరాబాద్‌  

(చదవండి: తల్లి మృతిని తట్టుకోలేక.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement