Simhastha Kumbh mela
-
సింహస్థా కుంభమేళాకు హిజ్రా సాధువులు
భోపాల్: చదివేందుకు వింతగానే ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ జిల్లాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు జరగనున్న సింహస్థా కుంభమేళాలో దాదాపు పదివేల మంది హిజ్రా సాధువులు పాల్గొని, పవిత్ర స్నానాలాచరించనున్నారట. దేశం నలుమూలల నుంచే కాకుండా బ్యాంకాక్ వంటి దేశాల నుంచి కూడా హిజ్రా సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తున్నారని ఉజ్జయిన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రుషి అజయ్‌దాస్ వెల్లడించారు. ఈ కుంభమేళాలో ఇప్పటిదాకా 13 వర్గాలకు చెందిన సాధువులు మాత్రమే పాల్గొనేవారని, వారికోసం మాత్రమే శిబిరాలు ఏర్పాటు చేసేవారని, ఈసారి హిజ్రా సాధువులు కూడా పెద్దమొత్తంలో హాజరవుతుండడంతో 14వ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని అజయ్‌దాస్ తెలిపారు. ఉజ్జయిన్‌లోని తన ఆశ్రమంలోనే హిజ్రా సాధువుల కోసం ఈ నెల 13 నుంచే శిబిరాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇదిలాఉండగా హిజ్రా సాధువుల విషయంలో మిగతా సాధువర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని పలువురు భావిస్తుండగా ఉజ్జయిన్ జిల్లా కలెక్టర్ మాత్రం.. అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు. -
దిగంబర సాధువులకు చిర్రెత్తింది
నాసిక్: పుష్కర స్నానాలకు వచ్చిన జైన దిగంబర సాధువులకు చిర్రెత్తిపోయింది. ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఉండే వారంతా ఆగ్రహంతో ఊగిపోతూ అధికారులపై చిందులేశారు. ఏమిటీ ఏర్పాట్లు, జాగ్రత్తలు అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోదావరి పుష్కరాలు ప్రారంభమైనట్లుగానే మహారాష్ట్రలో సింహాష్ట కుంభమేళా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జైన దిగంబర సాధువులు తరలి వచ్చారు. అయితే, గోదావరిలో నీళ్లు సరిగా లేకపోవడం, రాత్రి పూట విద్యుత్ సమస్య తలెత్తడం, చుట్టుపక్కల కుప్పలుగా చెత్తపేరుకోవడంవంటి పలు ఏర్పాట్ల లోపం వారికి కాస్త ఇబ్బంది కలిగించినట్లుదశరధ్ దాస్ అనే సాధువు అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుంభమేళాకు వచ్చే తమకు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కేటాయించాల్సి ఉంటుందని, ఆ విషయంలో అధికారులు విఫలమయ్యారని ముందు తమకు ఆ పనిచేసి పెట్టాలని కోరారు. కన్నంవార్ బ్రిడ్జి నుంచి లక్ష్మీనారాయణ ఘాట్ వరకు కిలో మీటర్ కుపైగా ఉంటుందని, దానిని ఇప్పటికీ ఓపెన్ చేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు.