‘నీ’ వల్ల నన్ను సింధీ అనుకున్నారు
ముంబై: అడాగ్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీ చదువుకున్నది ముంబై కిషన్‌చంద్ చెల్లారామ్ (కేసీ) కాలేజీలో. మరి ఆయనకు ఆ సీటెలా వచ్చింది? అక్కడివారు ఆయన్ను సింధీ అనుకోవటం వల్లా? ఏమో!! కావచ్చునంటున్నారు అనిల్ అంబానీ.
‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. 1975లో నేను కేసీ కాలేజ్‌లో చేరటానికి వెళ్లా. ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఇంటర్వ్యూలో నాతో మాట్లాడిన కుందానానీ, భంబానీ, నిచానీ, కేవల్మ్రణీ... అంతా నాతో సింధీలో మాట్లాడారు. నా పేరు చివర ‘నీ’ ఉంది కనక నన్ను కూడా సింధీ అనుకున్నారు. బహుశా! అందుకే అక్కడ సీటిచ్చారేమో అనిపించింది కూడా’’ అంటూ నాటి పరిస్థితులను శనివారం కాలేజీ వజ్రోత్సవాల సందర్భంగా గుర్తు చేసుకున్నారాయన.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తల్లి కోకిలాబెన్, భార్య టీనాతో కలిసి అనిల్ హాజరయ్యారు. ఒక భారతీయుడిగా, అందులోనూ ఒక గుజరాతీగా పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు అంబానీ. కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్... విద్య ప్రాముఖ్యాన్ని వివరించారు. మనుషులు అభివృద్ధి సాధించాలన్నా, పేద రికాన్ని తగ్గించాలన్నా అది చదువుతోనే సాధ్యమన్నారు.