సింగీతంకు హెచ్ఎం రెడ్డి పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు తొలి తెలుగు టాకీ దర్శకనిర్మాత ‘హెచ్ఎం రెడ్డి స్మారక అవార్డు’ ప్రదానం చేశారు. ఆకృతి సుధాకర్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఈ పురస్కారాన్ని అందించారు. సింగీతం బహుముఖ ప్రజ్ఞాశాలని జస్టిస్ చంద్రకుమార్ కొనియాడారు. ఏ ఉద్దేశం, లక్ష్యం కోసం జన్మించామో తెలుసుకొని ఆ దిశగా పయనించి సమాజంలో వెలుగులు నింపాలని యువతకు ఆయన సూచించారు.
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేవీ రమణాచారి, నవీన సుభాన్‌రెడ్డి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, లయన్ జయప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకముందు పలువురు గాయకులు ఆలపించిన సింగీతం సినీ గీతాల విభావరి అలరించింది.