Single number in the lottery
-
జోరుగా సింగిల్ నంబర్ ఆట
గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో సింగిల్ నంబర్ ఆట జోరుగా సాగుతోంది. నెలకు కోటి రూపాయలకు పైగా బెట్టింగ్‌ల కింద కాయకష్టం చేసుకునే పేద, మధ్య తరగతి వ్యక్తుల కష్టార్జితాన్ని నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఒక అరండల్‌పేటలోనే వంద మీటర్ల దూరంలో మూడు చోట్ల సింగిల్ నంబర్ ఆట నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో నడుస్తోందో చెప్పనవసరం లేదు. నిర్వాహకులకు పోలీసుల అండదండలు లేనిదే ఇది కొనసాగదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క కొరిటిపాడు పరిధిలో నెలకు రూ. 30 లక్షలకు పైగా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి రోడ్డు, స్వర్ణభారతీ నగర్ తదితర ప్రాంతాలలోనూ నిర్వాహకులు ధైర్యంగా మెయిన్ రోడ్లలోని చిన్నచిన్న బంకులు కేంద్రంగా సింగిల్ నంబర్ ఆట నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని కాలనీలలో పెద్దసంఖ్యలో రోజు వారి కూలీలలతోపాటు మధ్య తరగతివారు పోటీ పడి టికెట్లు కొంటున్నారు. ప్రధాన నిర్వాహకుడు ఓ ఖరీదైన లాడ్జిలో ఉండి అన్ని కాలనీల్లో ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించాడు. కొందరికి కమీషన్ రూపంలో, కొందరికి రోజుకు కొంత మొత్తం చెల్లిస్తూ కిందిస్థాయి పోలీసుల ద్వారా మామూళ్లూ పంపుతూ ధైర్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆట ఆటకు ఓ పేరు సినీ నటి శ్రీదేవి మరణించిన రెండు రోజుల నుంచి ప్రారంభించిన ఆటకు శ్రీదేవి అని పేరు పెట్టారు. కల్యాణి, శ్రీదేవి, టైజజార్, మెలాండే, వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అన్ని కాలనీల్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. 11.30 నిమిషాలకు మొదటి ఫలితాలు వస్తాయి. 12.30కు రెండో ఫలితం, 1 గంటకు 3 ఫలితం వెల్లడవుతాయి. సాయంత్ర 5 గంటలకు ముగుస్తాయి. బాంబే పేరుతో నిర్వహించే ఆట రాత్రంతా కొనసాగుతుంది. టికెట్ మీద ఉన్న నంబర్ తగిలితే 10 రూపాయలకు 70 , 100 రూపాయలకు 700 ఇస్తారు. ఈ ఆశతో ఎక్కువ మంది డబ్బులు వెచ్చిస్తున్నారు.అయితే, నెంబర్ తగిలేది కొంతమందికే. పబ్లిక్‌గా రోజువారి వసూళ్లు సింగిల్ నంబర్ ఆటల నిర్వాహకుల నుంచి కానిస్టేబుళ్లు, హోంగార్డులు పబ్లిక్‌గా రోజువారి మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదిలేస్తున్నరని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీనగర్ ఠాగూర్ బొమ్మ సెంటర్, అరండల్‌పేట 7వ లైను, పిచ్చుకల గుంట గోడ పక్కన ఆటలు నిర్వహిస్తున్నారని స్థానికులు వీడియో, ఫోటోలు తీసి రుజువు చూపిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఆ సమయంలో వెళ్లి పబ్లిక్‌గా మామూళ్లు తీసుకుంటుంటారని స్థానికులు విమర్శిస్తున్నారు. -
ష్..గప్‌చుప్!
ప్రకాశం ,చీరాల: పట్టణంలోని నల్లగాంధీ బొమ్మ ప్రాంతానికి చెందిన ఓ మహిళ స్థానిక ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి కన్నీరుమున్నీరయ్యింది. సింగిల్ నంబర్ లాటరీతో తన కాపురం గుల్లయ్యిందని, తన భర్త సంపాదన మొత్తం లాటరీకి తగలేస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వాపోయింది. ఆమె మాటల్లోనే.. తన భర్త సైకిళ్తు రిపేర్లు చేస్తుంటాడు. రోజూ సింగిల్ నంబర్ లాటరీ ఆడుతూ వచ్చే సంపాదన ఇంట్లో ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడు. అదేమని అడిగితే కొడుతున్నాడు. గంగమ్మ గుడి సమీపంలో నివాసండే నాగేశ్వరరావు, భాష్యం స్కూలు సమీపంలో నివాసం ఉండే సల్తాన్లు సింగిల్ నంబర్ లాటరీలు ఆడిస్తూ జనాల్ని పీల్చిపిప్పి చేస్తున్నారని వాపోయింది. ఇది ఒక్క ఆమె చెప్పిన గాథ మాత్రమే కాదు.. పట్టణంలో అనేక మంది మహిళలు ‘సాక్షి’కి ఫోన్ చేసి తమ కన్నీటి గాథలు పంచుకుంటున్నారు. చీరాల ప్రాంతం ప్రస్తుంతం సింగిల్ నంబర్ ఆటకు కేరాఫ్‌గా మారిపోయింది. రూ.10కి రూ.110లు వస్తాయనే ఆశతో బడుగులు ఈ ఆట ఆడుతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలు కాదు..పట్టణ నడిబొడ్డున, పలు వార్డుల్లో గుట్టు చప్పుడు కాకుండా సింగిల్ నంబర్ ఆట జరుగుతున్నా పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. రోజుకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు చీరాల నియోజకవర్గంలో సింగిల్ నంబర్ జూదం జరుగుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఈ ఆట విచ్చలవిడిగా జరుగుతోంది. చీరాల నియోజకవర్గంలోని చీరాల మున్సిపాలిటీ, చీరాల రూరల్, వేటపాలెం మండలాలు ఉన్నాయి. చేనేతలు, వ్యవసాయదారులు, చేతివృత్తుల వారు, అధికంగా దళితులు, బడుగు వర్గాల వారు నివశిస్తుంటారు. సింగిల్ నంబర్ ఆటను ఎక్కువగా సైకిల్‌షాపులు, హోటళ్లలో పనిచేసే వారు, రోజూవారి కూలీలు, పాలు విక్రయించే వారు, చిల్లర దుకాణాలు నడిపే వారే ఆడుతున్నారు. చీరాల ప్రాంతంలోని గొల్లపాలెం, రామకృష్ణాపురం, దేవాంగపురి, తోటవారిపాలెం, బుర్లవారిపాలెం, జయంతిపేట, జాన్‌పేట, మరియమ్మపేట, ఐక్యనగర్, విజయనగర్‌కాలనీ, పేరాల రెడ్డిపాలెం, దండుబాట, విఠల్‌నగర్, హరిప్రసాద్‌నగర్, వైకుంఠపురం, గాంధీనగర్, ప్రకాష్‌నగర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నారు. వేటపాలెం మండలంలోని దేవాంగపురి, రామన్నపేట, దేశాయిపేట, పందిళ్లపల్లి ప్రాంతాల్లో కూడా కొందరు సింగిల్ నంబర్ ఆటను ఆడిస్తూ లక్షలు గడిస్తున్నారు. బలవుతున్న బడుగులు సింగిల్ నంబర్ ఆట జోరుగా సాగుతుండటంతో అత్యాశకు వెళ్లి బడుగులు బలవుతున్నారు. సెన్సెక్స్ ఆధారంగా నిర్వహించే సింగిల్ నంబర్ ఆటకు రూ.10లకు 15 రెట్లు ఇస్తామని కొందరు బుకీలు గ్రామాలు, ప్రాంతాల వారీగా ఏజెంట్లను నియమించుకుని గుట్టుగా జూదం ఆడిస్తున్నారు. పేద ప్రజలు, రోజువారీ కూలీలే ఆటకు బానిసలై అప్పుల పాలు అవుతుండగా ఆటను ఆడిస్తున్న ఏజెంట్లు, బ్రోకర్లు రూ.లక్షలు గడిస్తున్నారు. కన్నెత్తి చూడని పోలీసులు చీరాల నియోజకవర్గంలోని చాలా గ్రామ పంచాయతీలు, పట్టణంలోని పలు వార్డుల్లో జోరుగా ఈ జూదం జరుగుతున్నా పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. చీరాల తెల్ల గాంధీబొమ్మ కూడలిలో, గొల్లపాలెం, గుంట మార్కెట్, ఈపూరుపాలెం, పేరాల రెడ్డిపాలెం, తోటవారిపాలెం చేనేత కాలనీలు, ఐక్యనగర్, రామకృష్ణాపురం, దండుబాట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఏజెంట్లు ఈ వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూదం జోరుగా జరుగుతూనే ఉంది. అయినా పోలీసులు ఆయా జూదశాలలపై కన్నెత్తి కూడా చూడకపోవడం బాధాకరం. పోలీసులు జూదరులు, జూదాన్ని నడిపేవారి వద్ద ఆమ్యామ్యాలు తీసుకుని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కలుగున్నాయని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సింగిల్ నంబర్ లాటరీలతో కుటుంబాలు మాత్రం సర్వనాశనం అవుతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. -
సింగిల్ నెంబర్ లాటరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : సింగిల్ నెంబర్ లాటరీ టికెట్ల విక్రయాలకు పాల్పడేవారిపై కఠిన చర్య లు తీసుకుంటామని బందరు డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బందరు, అవనిగడ్డ సబ్-డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో సింగిల్ నెంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు రహస్యంగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లాట రీల నిర్వాహకుల వలలోరోజువారీ కూలీలు, చేతివృత్తుల వారు, రిక్షా, భవన నిర్మాణ కార్మికులు, రోల్డుగోల్డు వర్కర్లు చిక్కుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లాటరీల నిర్వాహకులు టికెట్లను విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. లాటరీల కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. లాటరీ టికెట్లను కొనటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. బందరు, అవనిగడ్డ సబ్-డివిజన్లలో సింగిల్ నెంబర్ లాటరీ టికెట్లు అమ్మేవారిపై పోలీ సులు ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. లాటరీ వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే ఆ సమాచారాన్ని నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. లాటరీల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో చిలకలపూడి ఎస్‌హెచ్‌వో టి. సత్యనారాయణ, ఎస్సై లోవరాజు తదితరులు పాల్గొన్నారు.