ప్రకాశం ,చీరాల: పట్టణంలోని నల్లగాంధీ బొమ్మ ప్రాంతానికి చెందిన ఓ మహిళ స్థానిక ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి కన్నీరుమున్నీరయ్యింది. సింగిల్ నంబర్ లాటరీతో తన కాపురం గుల్లయ్యిందని, తన భర్త సంపాదన మొత్తం లాటరీకి తగలేస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వాపోయింది. ఆమె మాటల్లోనే.. తన భర్త సైకిళ్తు రిపేర్లు చేస్తుంటాడు. రోజూ సింగిల్ నంబర్ లాటరీ ఆడుతూ వచ్చే సంపాదన ఇంట్లో ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడు. అదేమని అడిగితే కొడుతున్నాడు. గంగమ్మ గుడి సమీపంలో నివాసండే నాగేశ్వరరావు, భాష్యం స్కూలు సమీపంలో నివాసం ఉండే సల్తాన్‌లు సింగిల్ నంబర్ లాటరీలు ఆడిస్తూ జనాల్ని పీల్చిపిప్పి చేస్తున్నారని వాపోయింది. ఇది ఒక్క ఆమె చెప్పిన గాథ మాత్రమే కాదు.. పట్టణంలో అనేక మంది మహిళలు ‘సాక్షి’కి ఫోన్ చేసి తమ కన్నీటి గాథలు పంచుకుంటున్నారు.
చీరాల ప్రాంతం ప్రస్తుంతం సింగిల్ నంబర్ ఆటకు కేరాఫ్‌గా మారిపోయింది. రూ.10కి రూ.110లు వస్తాయనే ఆశతో బడుగులు ఈ ఆట ఆడుతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలు కాదు..పట్టణ నడిబొడ్డున, పలు వార్డుల్లో గుట్టు చప్పుడు కాకుండా సింగిల్ నంబర్ ఆట జరుగుతున్నా పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. రోజుకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు చీరాల నియోజకవర్గంలో సింగిల్ నంబర్ జూదం జరుగుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఈ ఆట విచ్చలవిడిగా జరుగుతోంది. చీరాల నియోజకవర్గంలోని చీరాల మున్సిపాలిటీ, చీరాల రూరల్, వేటపాలెం మండలాలు ఉన్నాయి. చేనేతలు, వ్యవసాయదారులు, చేతివృత్తుల వారు, అధికంగా దళితులు, బడుగు వర్గాల వారు నివశిస్తుంటారు. సింగిల్ నంబర్ ఆటను ఎక్కువగా సైకిల్‌షాపులు, హోటళ్లలో పనిచేసే వారు, రోజూవారి కూలీలు, పాలు విక్రయించే వారు, చిల్లర దుకాణాలు నడిపే వారే ఆడుతున్నారు.
చీరాల ప్రాంతంలోని గొల్లపాలెం, రామకృష్ణాపురం, దేవాంగపురి, తోటవారిపాలెం, బుర్లవారిపాలెం, జయంతిపేట, జాన్‌పేట, మరియమ్మపేట, ఐక్యనగర్, విజయనగర్‌కాలనీ, పేరాల రెడ్డిపాలెం, దండుబాట, విఠల్‌నగర్, హరిప్రసాద్‌నగర్, వైకుంఠపురం, గాంధీనగర్, ప్రకాష్‌నగర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నారు. వేటపాలెం మండలంలోని దేవాంగపురి, రామన్నపేట, దేశాయిపేట, పందిళ్లపల్లి ప్రాంతాల్లో కూడా కొందరు సింగిల్ నంబర్ ఆటను ఆడిస్తూ లక్షలు గడిస్తున్నారు.
బలవుతున్న బడుగులు
సింగిల్ నంబర్ ఆట జోరుగా సాగుతుండటంతో అత్యాశకు వెళ్లి బడుగులు బలవుతున్నారు. సెన్సెక్స్ ఆధారంగా నిర్వహించే సింగిల్ నంబర్ ఆటకు రూ.10లకు 15 రెట్లు ఇస్తామని కొందరు బుకీలు గ్రామాలు, ప్రాంతాల వారీగా ఏజెంట్లను నియమించుకుని గుట్టుగా జూదం ఆడిస్తున్నారు. పేద ప్రజలు, రోజువారీ కూలీలే ఆటకు బానిసలై అప్పుల పాలు అవుతుండగా ఆటను ఆడిస్తున్న ఏజెంట్లు, బ్రోకర్లు రూ.లక్షలు గడిస్తున్నారు.
కన్నెత్తి చూడని పోలీసులు
చీరాల నియోజకవర్గంలోని చాలా గ్రామ పంచాయతీలు, పట్టణంలోని పలు వార్డుల్లో జోరుగా ఈ జూదం జరుగుతున్నా పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. చీరాల తెల్ల గాంధీబొమ్మ కూడలిలో, గొల్లపాలెం, గుంట మార్కెట్, ఈపూరుపాలెం, పేరాల రెడ్డిపాలెం, తోటవారిపాలెం చేనేత కాలనీలు, ఐక్యనగర్, రామకృష్ణాపురం, దండుబాట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఏజెంట్లు ఈ వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూదం జోరుగా జరుగుతూనే ఉంది. అయినా పోలీసులు ఆయా జూదశాలలపై కన్నెత్తి కూడా చూడకపోవడం బాధాకరం. పోలీసులు జూదరులు, జూదాన్ని నడిపేవారి వద్ద ఆమ్యామ్యాలు తీసుకుని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కలుగున్నాయని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సింగిల్ నంబర్ లాటరీలతో కుటుంబాలు మాత్రం సర్వనాశనం అవుతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment