Single permit
-
ఆర్టీసీకి దారులు మూస్తున్న ప్రైవేట్ రూట్
సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని మరింతగా అగాథంలోకి నెట్టే కొత్త విధానానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. నిబంధనలకు పాతరేసి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను తరలిస్తూ ఆర్టీసీ కొంప ముంచుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఇక దర్జాగా తిరగనున్నాయి. ఇంతకాలం టూరిస్ట్ పర్మిట్లకే పరిమితమవుతూ వచ్చిన బస్సులు ఇక సమూహాలతోపాటు వ్యక్తులుగా కూడా ప్రయాణికులను తరలించొచ్చు. దీంతో ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏంటీ ఈ మార్పు.. కేంద్ర ప్రభుత్వం గతంలో రోడ్డు రవాణా నిబంధనల్లో చేసిన అతి కీలక సవరణ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. గతంలో టూరిస్టు పర్మిట్లతో కేవలం నిర్ధారిత ప్రాంతం నుంచి గమ్యం వరకు సమూహాలను మాత్రమే తరలించే వెసులుబాటు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు బస్సులకు ఉండేది. ఏయే రాష్ట్రాల మీదుగా ఆ బస్సు తిరిగితే, ఆయా రాష్ట్రాలకు పర్మిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్యాటకాన్ని ప్రోత్సహించే పేరుతో కేంద్రం అఖిల భారత టూరిస్ట్ పర్మిట్ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా కొత్త పర్మిట్ విధానం, ప్రయాణికుల తరలింపులో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో పెళ్లి బృందాలు, యాత్రలు, ఇతర అవసరాలకు సంబంధించి ఒక ప్రాంతం నుంచి గమ్యం వరకు ఒకే బృందంగా ప్రయాణికులను తరలించేవారు. కానీ, ఇప్పుడు ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఎవరికి వారుగా ప్రయాణాలు చేయొచ్చు. అలాంటప్పుడు వారి గమ్యస్థానాలు కూడా వేరుగా ఉంటాయి. అంటే.. స్టేజీ క్యారియర్లుగా అధికారికంగా మారినట్టే. బస్సుకు బోర్డు పెట్టొద్దన్న నిబంధన తప్ప మిగతా అంతా ఆర్టీసీ బస్సు తరహాలోనే మారే అవకాశం కనిపిస్తోంది. పర్మిట్ ఫీజులు ఇలా.. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పర్మిట్ ఫీజులు వసూలు చేసుకునేవి. ఇప్పుడు దేశం మొత్తం ఒకే పర్మిట్ ఫీజు ఉంటుంది. మొత్తం వసూళ్ల నుంచి దామాషా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది. కొత్త ఫీజులు ఇలా... డ్రైవర్ కాకుండా తొమ్మిది మంది లోపు ప్రయాణికులుండే వాహనాలకు సంబంధించి ఏసీ వాహనాలకు రూ.25 వేలు, నాన్ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, పది అంతకంటే ఎక్కువ–23 కంటే తక్కువ మంది ప్రయాణికుల సామర్ధ్యం ఉండే వాహనాలలో ఏసీ అయితే రూ.75 వేలు, నాన్ ఏసీ అయితే రూ.50 వేలు, 23 మంది ప్రయాణికులు అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న వాహనాలకు ఏసీ అయితే రూ.3 లక్షలు, నాన్ ఏసీ అయితే రూ.2 లక్షలు వార్షిక పర్మిట్ ఫీజు చెల్లించాలి. ఇది మ్యాక్సీ క్యాబ్, టూరిస్టు బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. సొంత వాహనాలకు ఇది వర్తించదు. పెరగనున్న ప్రైవేటు బస్సులు ప్రస్తుతం రాష్ట్రంలో 4,575 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని టూరిస్టు బస్సులు పోను, మిగతావన్నీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే. ఆర్టీసీ తరహాలో ఇవి టికెట్లు బుక్ చేసి ప్రయాణికులను తరలిస్తున్నాయి. వీటి వల్ల సాలీనా ఆర్టీసీ రూ.3 వేల కోట్ల వరకు నష్టపోతోందన్న అంచనా ఉంది. ప్రైవేట్ బస్సులను నియంత్రించే యంత్రాంగంలోని పలువురు సిబ్బంది నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఎప్పుడో ఓసారి దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ, రవాణా శాఖలతో కలిపి ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించి, అప్పటి జేటీసీ వెంకటేశ్వర్లుకు బాధ్యత అప్పగించారు. కానీ, ఆ తర్వాత దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ అధికారి రిటైరయ్యే వరకు ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తవిధానం వచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దూరప్రాంతాలకు అవి స్టేజీ క్యారియర్లుగా తిరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆర్టీసీకి అశనిపాతమే.. ‘కొత్తగా అమలులోకి వచ్చిన ఈ వెసులుబాటు నిజంగా ఆర్టీసీకి అశనిపాతమే కానుంది. ఊరి పేరుతో బోర్డు లేకుండా ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారియర్ల తరహాలోనే తిరుగుతాయి. చర్యలు తీసుకుంటారన్న భయం కూడా ఉండదు. కేంద్రం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించే వెసులుబాటు ఇందులో లేకుండా పోయింది’’ –గాంధీ, రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ -
బాబ్బాబు.. ఒక్క సంతకం!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నాలుగేళ్లుగా నానుతున్న సింగిల్ పర్మిట్ వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఒప్పందానికి ఏపీ సీఎం చంద్రబాబు అస్సలు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ప్రతీరోజూ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి రావాలంటే.. రూ.వేలకు వేలు చలానా కడుతున్నామంటూ లారీల యజమానులు వాపోతున్నారు. దీంతో తాము ఆ ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. సింగిల్ పర్మిట్ అంటే.. దేశంలో ప్రతీ రాష్ట్రంలోని వాహనాలు వివిధ పనుల రీత్యా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా రాష్ట్ర సరిహద్దు దాటిన ప్రతీసారి రూ.1,500 వరకు చలానా కడతారు. అయితే ఇలా రోజూ రాకపోకలు సాగించే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి వాహనాల కోసం పొరుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటాయి. దాన్నే సింగిల్ పర్మిట్ విధానం అంటారు. దీని ప్రకారం.. ఒక వాహనం తరచుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏటా రూ.5,000 చెల్లిస్తే చాలు. ఏడాది పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో భాగంగా తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో ఒప్పందం చేసుకుంది. కానీ ఏపీతో మాత్రం ఇంతవరకు చేసుకోలేకపోయింది. ఏంటి వివాదం? రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు మించి లారీలున్నాయి. వీటిలో 80 శాతం లారీలు కేవలం స్టేట్ పర్మిట్ మాత్రమే తీసుకున్నాయి. వీటిలో చాలావరకు రాష్ట్ర విభజనకు ముందు కొనుగోలు చేసినవే. ఆ సమయంలో ఆంధ్రాలోని కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎలాంటి ప్రత్యేక చలానాలు ఉండేవి కావు. 2015 మార్చి 31 వరకు ఈ విధానం కొనసాగింది. కానీ, ఆ తర్వాత రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ తెలంగాణకే అధిక నష్టం వాటిల్లుతోంది. ఏపీలో ఉన్న లారీల్లో 80 శాతం వాటికి రిజిస్ట్రేషన్ సమయంలోనే నేషనల్ పర్మిట్ తీసుకున్నారు. దీంతో వారి లారీలు తెలంగాణకు సులువుగానే రాగలుగుతున్నాయి. దాదాపు 80 శాతం పైగా తెలంగాణ లారీలకు నేషనల్ పర్మిట్ లేదు. దీంతో వీళ్లు ఆంధ్రా సరిహద్దు దాటిన ప్రతీసారి రూ.1,500 చెల్లించాల్సి వస్తోంది. ఎప్పుడు సంతకం చేస్తారో.. లారీ యజమానులపై ఆర్థిక భారంగా మారిన ఈ వివాదంపై తెలంగాణ లారీ యజమానుల సంఘం సీఎం కేసీఆర్‌ను కలసింది. దీంతో ఒప్పందాన్ని రూపొందించి దానిపై సంతకం చేసి 2015 సెప్టెంబర్‌లోనే ఏపీకి పంపారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఆ ఫైల్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తెలంగాణ లారీ యజమానుల సంఘం నేతలు ఏపీ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిశాక రెండు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎప్పుడు సంతకం చేస్తారా.. అని లారీ యజమానులు కోటికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మాగోడుపట్టించుకోవాలి.. సింగిల్ పర్మిట్ విషయంపై ఆంధ్రప్రదేశ్ సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని తెలంగాణ లారీ యజమానుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ‘సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పలుమార్లు, ఏపీ రవాణా మంత్రి, అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై సమస్యను విన్నవించారు. అంతా సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ, ఫైల్‌పై ఏపీ సీఎం సంతకం మాత్రం కావడం లేదు. గతవారం కూడా మరోసారి రవాణా మంత్రిని కలసి విన్నవించాం. ఇప్పటికీ నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడైనా మా గోడు పట్టించుకుని ఫైల్‌పై సంతకం చేయాలని కోరుతున్నాం..’అని చెప్పారు. -
మా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వండి
ఏపీ సీఎంను కోరిన రాష్ట్ర లారీ యజమానుల సంఘం వినతిపత్రం సమర్పించిన సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, అమరావతి: తమ లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. తమ లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వరకూ వచ్చి వారు నిరసన తెలపటం విశేషం. సంఘం గౌరవాధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ చంద్రబాబును కలసి వినతిపత్రం అందచేసి అనంతరం సంఘం ప్రతినిధులు ఎన్.భాస్కరరెడ్డి, జి.దుర్గాప్రసాద్‌తో కలిసి సీఎం క్యాంపు కార్యాల యంలోని మీడియా పాయింట్లో శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉమ్మడిగా ఉండి ప్రస్తుతం విడిపోయిన రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం లారీలకు లేకపోవటం బాధాకరమన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఏపీ లారీలను ఆపినపుడు సింగిల్ పర్మిట్‌కు సంబంధించిన ఫైల్ తెలంగాణ సీఎం వద్ద అపరిష్కృతంగా ఉందని చెప్పారని, తాము పరిశీలిస్తే అలాంటి ఫైల్ ఏదీ తమ రాష్ట్రానికి రాలేదన్నారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లారీలకు సింగిల్ పర్మిట్‌ను అమలు చేస్తున్నందున ఏపీ కూడా అదే విధానాన్ని అమలు చేయాలన్నారు. 2 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు. సింగిల్ పర్మిట్‌కు సంబంధించి తెలంగాణ సీఎం సంతకం చేసిన ఫైల్ ఏపీలో అపరిష్కృతంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని తాము సీఎంను కోరామన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వస్తామన్న ఉద్యోగులను తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆస్తుల విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని, త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
సింగిల్ పర్మిట్ అమలులో ఏపీ సర్కారు జాప్యం
నేడు చంద్రబాబును కలవనున్న టీ.లారీ యజమానుల సంఘం సాక్షి, హైదరాబాద్: అంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య సరిహద్దు దాటే లారీలకు సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయ టంలో తీవ్ర జాప్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ లారీ యజమా నుల సంఘం అమీతుమీ తేల్చుకునేం దుకు సిద్ధమైంది. తాత్కాలిక పర్మిట్ రూపంలో ఒక్కో లారీకి ఏడాదికి వేలాది రూపా యల నష్టం వాటిల్లుతోందని లారీ యజ మానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెలం గాణ లారీ యజమానుల సంఘం గౌరవా ధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆధ్వ ర్యంలో విజయవాడ వెళ్లి ఏపీ సీఎం చంద్ర బాబును కలవాలని నిర్ణరుుంచారు. సిం గిల్ పర్మిట్ విధానం అమలు చేయాల్సి ఉంది. కానీ దానికి ఏపీ ప్రభుత్వం ముం దుకు రాకపోవటంతో తాత్కాలిక పర్మిట్ రూపంలో రోజూ రూ.1600, వారానికి రూ.4200 చెల్లించాల్సి వస్తోంది. సింగిల్ పర్మిట్ విధానంలో రూ.5 వేలు చెల్లిస్తే సంవత్సరమంతా ఎన్ని ట్రిప్పులైనా స్వేచ్ఛగా తిరిగే వీలు చిక్కుతుంది. -
సింగిల్ పర్మిట్ ఇవ్వండి.. లేదంటే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత రవాణా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వకపోతే ఏపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నేతలు సయ్యద్ సాధిక్, నవాజ్ గోరి తదితరులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను టక్కర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లారీ అసోసియేషన్ ప్రతినిధులతో కలసి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత విధానం వల్ల నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు చెల్లించాల్సి వస్తోందని, దీంతో లారీ యాజమాన్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. సింగిల్ పర్మిట్ విధానం ద్వారా రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ఏపీకి కూడా తెలంగాణ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఏపీనే ముందుకు రావట్లేదని చెప్పారు. జూన్ 6 లోగా ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే కోదాడ వద్ద ఏపీ లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు.