బాబ్బాబు.. ఒక్క సంతకం! | Single permit dispute between Telangana and Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబ్బాబు.. ఒక్క సంతకం!

Published Mon, Jan 14 2019 3:26 AM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM

Single permit dispute between Telangana and Andhra Pradesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నాలుగేళ్లుగా నానుతున్న సింగిల్‌ పర్మిట్‌ వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఒప్పందానికి ఏపీ సీఎం చంద్రబాబు అస్సలు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ప్రతీరోజూ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి రావాలంటే.. రూ.వేలకు వేలు చలానా కడుతున్నామంటూ లారీల యజమానులు వాపోతున్నారు. దీంతో తాము ఆ ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.

సింగిల్‌ పర్మిట్‌ అంటే..
దేశంలో ప్రతీ రాష్ట్రంలోని వాహనాలు వివిధ పనుల రీత్యా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా రాష్ట్ర సరిహద్దు దాటిన ప్రతీసారి రూ.1,500 వరకు చలానా కడతారు. అయితే ఇలా రోజూ రాకపోకలు సాగించే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి వాహనాల కోసం పొరుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటాయి. దాన్నే సింగిల్‌ పర్మిట్‌ విధానం అంటారు. దీని ప్రకారం.. ఒక వాహనం తరచుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏటా రూ.5,000 చెల్లిస్తే చాలు. ఏడాది పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో భాగంగా తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో ఒప్పందం చేసుకుంది. కానీ ఏపీతో మాత్రం ఇంతవరకు చేసుకోలేకపోయింది.

ఏంటి వివాదం?
రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు మించి లారీలున్నాయి. వీటిలో 80 శాతం లారీలు కేవలం స్టేట్‌ పర్మిట్‌ మాత్రమే తీసుకున్నాయి. వీటిలో చాలావరకు రాష్ట్ర విభజనకు ముందు కొనుగోలు చేసినవే. ఆ సమయంలో ఆంధ్రాలోని కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎలాంటి ప్రత్యేక చలానాలు ఉండేవి కావు. 2015 మార్చి 31 వరకు ఈ విధానం కొనసాగింది. కానీ, ఆ తర్వాత రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ తెలంగాణకే అధిక నష్టం వాటిల్లుతోంది. ఏపీలో ఉన్న లారీల్లో 80 శాతం వాటికి రిజిస్ట్రేషన్‌ సమయంలోనే నేషనల్‌ పర్మిట్‌ తీసుకున్నారు. దీంతో వారి లారీలు తెలంగాణకు సులువుగానే రాగలుగుతున్నాయి. దాదాపు 80 శాతం పైగా తెలంగాణ లారీలకు నేషనల్‌ పర్మిట్‌ లేదు. దీంతో వీళ్లు ఆంధ్రా సరిహద్దు దాటిన ప్రతీసారి రూ.1,500 చెల్లించాల్సి వస్తోంది.

ఎప్పుడు సంతకం చేస్తారో..
లారీ యజమానులపై ఆర్థిక భారంగా మారిన ఈ వివాదంపై తెలంగాణ లారీ యజమానుల సంఘం సీఎం కేసీఆర్‌ను కలసింది. దీంతో ఒప్పందాన్ని రూపొందించి దానిపై సంతకం చేసి 2015 సెప్టెంబర్‌లోనే ఏపీకి పంపారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఆ ఫైల్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తెలంగాణ లారీ యజమానుల సంఘం నేతలు ఏపీ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిశాక రెండు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎప్పుడు సంతకం చేస్తారా.. అని లారీ యజమానులు కోటికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికైనా మాగోడుపట్టించుకోవాలి..
సింగిల్‌ పర్మిట్‌ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని తెలంగాణ లారీ యజమానుల సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ‘సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పలుమార్లు, ఏపీ రవాణా మంత్రి, అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై సమస్యను విన్నవించారు. అంతా సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ, ఫైల్‌పై ఏపీ సీఎం సంతకం మాత్రం కావడం లేదు. గతవారం కూడా మరోసారి రవాణా మంత్రిని కలసి విన్నవించాం. ఇప్పటికీ నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడైనా మా గోడు పట్టించుకుని ఫైల్‌పై సంతకం చేయాలని కోరుతున్నాం..’అని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement