lorrys
-
బాబ్బాబు.. ఒక్క సంతకం!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నాలుగేళ్లుగా నానుతున్న సింగిల్ పర్మిట్ వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఒప్పందానికి ఏపీ సీఎం చంద్రబాబు అస్సలు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ప్రతీరోజూ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి రావాలంటే.. రూ.వేలకు వేలు చలానా కడుతున్నామంటూ లారీల యజమానులు వాపోతున్నారు. దీంతో తాము ఆ ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. సింగిల్ పర్మిట్ అంటే.. దేశంలో ప్రతీ రాష్ట్రంలోని వాహనాలు వివిధ పనుల రీత్యా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా రాష్ట్ర సరిహద్దు దాటిన ప్రతీసారి రూ.1,500 వరకు చలానా కడతారు. అయితే ఇలా రోజూ రాకపోకలు సాగించే వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి వాహనాల కోసం పొరుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటాయి. దాన్నే సింగిల్ పర్మిట్ విధానం అంటారు. దీని ప్రకారం.. ఒక వాహనం తరచుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏటా రూ.5,000 చెల్లిస్తే చాలు. ఏడాది పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో భాగంగా తెలంగాణ పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో ఒప్పందం చేసుకుంది. కానీ ఏపీతో మాత్రం ఇంతవరకు చేసుకోలేకపోయింది. ఏంటి వివాదం? రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు మించి లారీలున్నాయి. వీటిలో 80 శాతం లారీలు కేవలం స్టేట్ పర్మిట్ మాత్రమే తీసుకున్నాయి. వీటిలో చాలావరకు రాష్ట్ర విభజనకు ముందు కొనుగోలు చేసినవే. ఆ సమయంలో ఆంధ్రాలోని కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎలాంటి ప్రత్యేక చలానాలు ఉండేవి కావు. 2015 మార్చి 31 వరకు ఈ విధానం కొనసాగింది. కానీ, ఆ తర్వాత రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ తెలంగాణకే అధిక నష్టం వాటిల్లుతోంది. ఏపీలో ఉన్న లారీల్లో 80 శాతం వాటికి రిజిస్ట్రేషన్ సమయంలోనే నేషనల్ పర్మిట్ తీసుకున్నారు. దీంతో వారి లారీలు తెలంగాణకు సులువుగానే రాగలుగుతున్నాయి. దాదాపు 80 శాతం పైగా తెలంగాణ లారీలకు నేషనల్ పర్మిట్ లేదు. దీంతో వీళ్లు ఆంధ్రా సరిహద్దు దాటిన ప్రతీసారి రూ.1,500 చెల్లించాల్సి వస్తోంది. ఎప్పుడు సంతకం చేస్తారో.. లారీ యజమానులపై ఆర్థిక భారంగా మారిన ఈ వివాదంపై తెలంగాణ లారీ యజమానుల సంఘం సీఎం కేసీఆర్‌ను కలసింది. దీంతో ఒప్పందాన్ని రూపొందించి దానిపై సంతకం చేసి 2015 సెప్టెంబర్‌లోనే ఏపీకి పంపారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఆ ఫైల్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తెలంగాణ లారీ యజమానుల సంఘం నేతలు ఏపీ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిశాక రెండు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎప్పుడు సంతకం చేస్తారా.. అని లారీ యజమానులు కోటికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మాగోడుపట్టించుకోవాలి.. సింగిల్ పర్మిట్ విషయంపై ఆంధ్రప్రదేశ్ సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని తెలంగాణ లారీ యజమానుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ‘సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పలుమార్లు, ఏపీ రవాణా మంత్రి, అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై సమస్యను విన్నవించారు. అంతా సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ, ఫైల్‌పై ఏపీ సీఎం సంతకం మాత్రం కావడం లేదు. గతవారం కూడా మరోసారి రవాణా మంత్రిని కలసి విన్నవించాం. ఇప్పటికీ నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడైనా మా గోడు పట్టించుకుని ఫైల్‌పై సంతకం చేయాలని కోరుతున్నాం..’అని చెప్పారు. -
సమ్మెకు లారీల సై.. ధరల రయ్
సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లు నేరవేర్చాలంటూ శుక్రవారం నుంచి లారీల యజమానులు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం లారీల యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. అవి సఫలమవ్వకుంటే ఈ అర్ధరాత్రి నుంచే ఎక్కడికక్కడ లారీలకు బ్రేక్ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. అదే జరిగితే రెండు మూడ్రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలతో అక్కడి నుంచి కూరగాయల సరఫరా తగ్గుముఖం పట్టగా, లారీల సమ్మెతో అది మరింత తీవ్రం కానుంది. టమాటా ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.35 పలుకుతుండగా, మిర్చి కిలో రూ.110కి చేరింది. మిగతా కూరగాయలు ధరలు సైతం ఇప్పటికే రూ.20 నుంచి రూ.40 వరకు ఉండగా అవన్నీ క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. వీటితో బియ్యం, పప్పులు ఇతర సరుకులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ప్రధాన డిమాండ్లివే.. డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలంటూ దేశవ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి మూడు నెలలకోసారి సవరించాలని లారీల యజమానులు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే టోల్గేట్లు తొలగించాలని, పెంచిన థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించాలని, టీడీఎస్ వసూలు రద్దు చేయాలన్నవి మిగతా ప్రధాన డిమాండ్లు. దీంతో పాటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలుచేయాలని, అలాగే ప్రమాదం లేదా ఓవర్‌లోడ్ విషయంలో డ్రైవర్ లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు. వీటన్నింటిని సత్వరమే పరిష్కరించాలని కోరుతూ లారీల యజమానులు సమ్మె తలపెట్టారు. ధరలు పైపైనే.. ఇప్పటికే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. లారీల సమ్మెతో ధరలు పెరిగితే సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా టమాట ధర మార్కెట్లో కిలో రూ.35 పలుకుతోంది. ప్రతి ఏటా జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి 500 టన్నుల మేర టమాట వస్తుండగా అది ప్రస్తుతం 200 నుంచి 300 టన్నులకు పడిపోయింది. తాజా సమ్మెతో మదనపల్లి నుంచి సరఫరా ఆగిపోతే ధరలు మరింత పెరిగే అవకాశముంది. హైదరాబాద్ పరిధిలోని మొజాంజాహీ మార్కెట్, గడ్డి అన్నారం, బోయిన్పల్లి మార్కెట్లకు సరుకు రవాణా ఆగిపోనుంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయాలు, పండ్లు సరఫరా చేసే లారీలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్న నేపథ్యంలో వాటి ధరలకు రెక్కలొచ్చే ప్రమాదముంది. ఇక మిర్చి ధర ఇప్పటికే ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం కిలో మిర్చి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రూ.95 వరకు ఉండగా, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రూ.110 మించి పలుకుతోంది. అలాగే కాకర కిలో రూ.25, వంకాయ రూ. 25, క్యాప్సికం రూ.40, గోబీ రూ.30, బెండకాయ రూ.25 ఉండగా.. సమ్మెతో వీటి ధరలు పెరగనున్నాయి. తగ్గిన ఉల్లి సరఫరా.. ఇక రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగ్గా ఉల్లి సరఫరా తగ్గింది. ప్రస్తుతం లారీ రవాణా ఆగితే ఉల్లి ధరల పెరిగే అవకాశముంది. ఇక బియ్యం, పప్పులు, నూనెలపై ధరల ప్రభావం ఎలా ఉంటుందన్నది సమ్మె కాలాన్ని బట్టి ఉంటుందని మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. ఇక రేషన్ లబ్ధిదారులకు పీడీఎస్ బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇప్పటికే 80శాతం బియ్యం సరఫరా ముగిసినందున సమస్య ఉత్పన్నం కాదని పౌర సరఫరాల శాఖ వర్గాలు అంటున్నాయి. -
ఘోర ప్రమాదం : రెండు లారీలు, బస్సు ఢీ
-
ఘోరం : రెండు లారీలు, బస్సు ఢీ
సాక్షి, విజయనగరం : జిల్లాలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద కోల్‌కతా చెన్నై జాతీయ రహదారిపై బుధవారం రెండు లారీలు, బస్సు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 30 మందిపైగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు బస్సు పూర్తిగా అదుపుతప్పి బోల్తా పడింది. రెండు లారీల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న గ్రామస్థులు కేబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్లను బయటకు లాగారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని కోడూరు గ్రామానికి చెందిన సుమారు అరవై మంది భక్తులు కాశీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరుకు మరో రెండు గంటల్లో చేరుకుంటారనగా ఈ దుర్ఘటన జరిగింది. బోల్తా పడిన బస్సులో పలువురు లోపలే ఇరుక్కుపోయారు. లారీడ్రైవర్లు క్యాబిన్‌లోనే చిక్కుకుపోయారు. సహాయం కోసం బాధితులు చేస్తున్న ఆర్తానాదాలు మిన్నంటాయి. అందుబాటులో ఒకే అంబులెన్స్ ఉండటంతో సహాయక చర్యలు మందగొడిగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆరా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా జర్మనీలో ఉన్న ఆయన ప్రమాద ఘటనపై విజయనగరం జిల్లా ఎస్పీని ఫోనులో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాల కోసం అదనపు పోలీసు బలగాలను ఘటన స్ధలానికి తరలించాలని ఎస్పీని ఆదేశించారు. -
రెండు లారీలు ఢీ..8 కిలోమీటర్లు ట్రాఫిక్ జాం
చివ్వెంల(నల్లగొండ): ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలవడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. లారీలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. సూర్యాపేట-ఖమ్మం రహదారి పై ఎనిమిది కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలను తొలగించడానికి యత్నిస్తున్నారు. -
రక్తమోడిన రోడ్డు
పోరుమామిళ్ల, న్యూస్‌లైన్: రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల బస్టాప్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు, మరొకరు క్లీనర్. ఎలా జరిగిందంటే.. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి సిమెంట్ లోడుతో ఓ లారీ మైదుకూరు బయలుదేరింది. మరో లారీ ఎర్రగుంట్ల నుంచి సిమెంట్ లోడుతో గుంటూరుకు బయలుదేరింది. రెండు లారీలు నాగలకుంట్ల వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో రెండు లారీల డ్రైవర్లు శ్రీను(45), బత్తుల లక్ష్మీనరసయ్య(43), క్లీనర్ ఆంజనేయులు(25) అక్కడికక్కడే మరణించారు. మరో క్లీనర్ శ్రీనివాసులు, ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రెండు లారీలు తుక్కుతుక్కవడంతో మృతదేహాలు లారీ క్యాబిన్లలోనే ఇరుక్కుపోయాయి. మృతుల్లో మాచర్ల లారీ డ్రైవర్ శ్రీను, క్లీనర్ ఆంజనేయులు మామా అల్లుళ్లు అని తెలిసింది. శ్రీను కంభంపాడు వాసి. గాయపడ్డ క్లీనర్ శ్రీనివాసులు లారీ డ్రైవర్ లక్ష్మీనరసయ్యకు కుమారుడని సమాచారం. వీరి స్వస్థలం సిద్దవటం అని తెలిసింది. నిద్ర మత్తే కారణం? మాచర్ల నుంచి వచ్చిన లారీని చూసి ఎర్రగుంట్ల నుంచి వచ్చిన లారీని డ్రైవర్ సైడ్ ఇచ్చినా ప్రమాదం జరిగిందని అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. దీనికి కారణంగా మాచర్ల లారీ డ్రైవర్ శ్రీనుకు నిద్ర ముంచుకు రావడంతో ఆయన లారీని నియంత్రించలేకపోవడంతో ఘోర సంఘటన జరిగిందని భావిస్తున్నారు. లారీలోని ఓ ప్రయాణికుడు ఫోన్లో ఇచ్చిన సమాచారంతో పోరుమామిళ్ల అగ్నిమాపక అధికారి విజయకుమార్, సీఐ వెంకటకుమార్ సిబ్బందితో వచ్చి లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.