రక్తమోడిన రోడ్డు
Published Wed, Sep 25 2013 5:35 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పోరుమామిళ్ల, న్యూస్‌లైన్: రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల బస్టాప్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు, మరొకరు క్లీనర్.
ఎలా జరిగిందంటే.. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి సిమెంట్ లోడుతో ఓ లారీ మైదుకూరు బయలుదేరింది. మరో లారీ ఎర్రగుంట్ల నుంచి సిమెంట్ లోడుతో గుంటూరుకు బయలుదేరింది. రెండు లారీలు నాగలకుంట్ల వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో రెండు లారీల డ్రైవర్లు శ్రీను(45), బత్తుల లక్ష్మీనరసయ్య(43), క్లీనర్ ఆంజనేయులు(25) అక్కడికక్కడే మరణించారు. మరో క్లీనర్ శ్రీనివాసులు, ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రెండు లారీలు తుక్కుతుక్కవడంతో మృతదేహాలు లారీ క్యాబిన్లలోనే ఇరుక్కుపోయాయి. మృతుల్లో మాచర్ల లారీ డ్రైవర్ శ్రీను, క్లీనర్ ఆంజనేయులు మామా అల్లుళ్లు అని తెలిసింది. శ్రీను కంభంపాడు వాసి. గాయపడ్డ క్లీనర్ శ్రీనివాసులు లారీ డ్రైవర్ లక్ష్మీనరసయ్యకు కుమారుడని సమాచారం. వీరి స్వస్థలం సిద్దవటం అని తెలిసింది.
నిద్ర మత్తే కారణం?
మాచర్ల నుంచి వచ్చిన లారీని చూసి ఎర్రగుంట్ల నుంచి వచ్చిన లారీని డ్రైవర్ సైడ్ ఇచ్చినా ప్రమాదం జరిగిందని అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. దీనికి కారణంగా మాచర్ల లారీ డ్రైవర్ శ్రీనుకు నిద్ర ముంచుకు రావడంతో ఆయన లారీని నియంత్రించలేకపోవడంతో ఘోర సంఘటన జరిగిందని భావిస్తున్నారు. లారీలోని ఓ ప్రయాణికుడు ఫోన్‌లో ఇచ్చిన సమాచారంతో పోరుమామిళ్ల అగ్నిమాపక అధికారి విజయకుమార్, సీఐ వెంకటకుమార్ సిబ్బందితో వచ్చి లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement