యశోద తీవ్రంగా గాయపడింది.
గుంటూరు: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న 13నెలల కొడుకుతో కలిసి నవ్వుతూ.. తుళ్లుతూ ద్విచక్రవాహనంపై ఊరు బయలుదేరిన ఆ తల్లిదండ్రుల ఆనందం అంతలోనే ఆవిరైంది. అప్పటివరకు అమ్మఒడిలో కేరింతలు కొడుతూ ముద్దుముద్దు పలుకులుతో మురిపించిన పుత్రుడు క్షణకాలంలో లారీ రూపంలో వచ్చిన మృత్యుఒడిలోకి జారిపోతుంటే తల్లడిల్లిన ఆ తల్లి కాపాడుకునేందుకు ఒక్క ఉదుటన కిందకు దూకినా ఫలితం లేకపోయింది. పసివాడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ తల్లీ మృత్యువుతో పోరాడుతోంది.
ఓ వైపు విగతజీవిగా మారిన కొడుకు, మరోవైపు తీవ్రగాయాలతో రక్తమోడుతున్న భార్యను చూసి ఆ భర్త ఘటనా స్థలంలోనే తీవ్రంగా విలపించాడు. ఈ హృదయవిదారక ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్ల మండలం కామేపల్లికి చెందిన ఏపూరి కొండలరావు, యశోద దంపతులు. వీరు కొడుకు తేజ ఈశ్వర్‌ఆదిత్య(13నెలలు)ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కొండలరావు శుక్రవారం భార్య యశోద, కుమారుడు తేజ ఈశ్వర్ ఆదిత్యతో కలిసి కళ్లేపల్లిలోని అత్తగారింటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. పొందుగల సమీపంలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై తల్లి ఒడిలో ఉన్న తేజ ఈశ్వర్‌ఆదిత్య కిందపడిపోయాడు. అతడిని కాపాడేందుకు తల్లి యశోద కూడా కిందకు దూకింది. అంతలోనే ఇద్దరిపై నుంచి లారీ వెళ్లటంతో తేజ ఈశ్వర్‌ఆదిత్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. యశోద తీవ్రంగా గాయపడింది. కొండలరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కొడుకు మృతిచెందటం.. భార్య తీవ్రంగా గాయపడటంతో కొండలరావు ఘటనాస్థలంలో విలపించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది. స్థానికులు వెంటనే స్పందించి యశోదను 108 వాహనం ద్వారా చికిత్స కోసం పిడుగురాళ్లకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ఘటన స్థలాన్ని సీఐ షేక్ బిలాలుద్దీన్, ఎస్‌ఐ దాసరి నాగరాజు, సంధ్యారాణి, ఏఎస్‌ఐ కృష్ణారావు పరిశీలించారు. తేజ ఈశ్వర్ ఆదిత్య మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment