మృత్యు ఘోష | Huge Road Accident Kills Ten People In Guntur District | Sakshi
Sakshi News home page

మృత్యు ఘోష

Published Mon, Mar 2 2020 5:00 AM | Last Updated on Mon, Mar 2 2020 7:53 AM

Huge Road Accident Kills Ten People In Guntur District - Sakshi

గుంటూరు జిల్లా కుర్నూతల సమీపంలో కొండ వాగులోకి బోల్తా పడిన కారులోని క్షతగాత్రులను బయటికి తీస్తున్న స్థానికులు

దారి కాసిన మృత్యువు వికటాట్టహాసం చేసింది. ఒకే రోజున 10 మంది ప్రాణాలను కబళించింది. గుంటూరు జిల్లా కుర్నూతల సమీపంలో పాత మద్రాసు రోడ్డుపై మృత్యుఘోష మిన్నంటి ఆరుగుర్ని బలి తీసుకోగా.. అదే జిల్లాలోని చలమల– శ్రీరామపురం మధ్య మరో నలుగుర్ని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. శుభకార్యంలో బంధువులతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలు ఆవిరయ్యాయి. నిండు నూరేళ్లూ చల్లగా జీవించమని దీవించిన వారే విగత జీవులుగా మారారు. పొట్ట కూటి కోసం కూలికెళ్లిన ముఠా కూలీలు మృత్యు బాహువుల నుంచి తప్పించుకోలేక చితి మీదకు చేరారు. టవేరా కారు కొండవాగులోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. మరో ఘటనలో మిర్చి లారీ క్వారీ గుంతలోకి బోల్తా పడింది. ఈ రెండు ప్రమాదాల్లోమరో 12 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో ఆరుగురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

వట్టిచెరుకూరు/ప్రత్తిపాడు/వెల్దుర్తి/మాచర్ల/గుంటూరు/పట్నంబజార్‌: గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన 12 మంది (డ్రైవర్‌తో కలిపి) ఆదివారం ఉదయం గుంటూరు రూరల్‌ మండలంలోని ఏటుకూరు గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓణీల ఫంక్షన్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు బంధుమిత్రులందరితో కలిసి ఆప్యాయతలు పంచుకున్నారు. భోజనం చేసిన తరువాత సాయంత్రం 4 గంటలకు కాకుమానుకు టవేరా వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. మితిమీరిన వేగంతో వెళుతున్న ఆ కారు వట్టిచెరుకూరు మండలం కుర్నూతల సమీపంలో పాత మద్రాస్‌ రోడ్డుపై ముందు వెళుతున్న కారును ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి గాలిలోకి లేచి పల్టీలు కొట్టుకుంటూ.. చెట్ల మీదుగా కొండవాగులోని ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు వాగులోకి దిగి వారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే కాకుమాను మండలానికి చెందిన ప్రసాదం వన్నూరు (65), పొగర్తి రమణమ్మ (55), పొగర్తి సీతమ్మ (60) పొగర్తి వీరలక్ష్మి (55), డ్రైవర్‌ కమాధుల శ్రీనివాసరావు (50) మృతి చెందారు.

తీవ్ర గాయాల పాలైన వజ్జా సుబ్బులు (55)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలొదిలాడు. తెల్లమేకల అనిత, ప్రసాదం నాగేశ్వరరావు, బొజ్జా రాఘవులు, ప్రసాదం మల్లేశ్వరి, ప్రసాదం బ్రహ్మయ్య, ప్రసాదం నాగేంద్రంను వాగులోంచి బయటకు తీసి 108 వాహనాల్లో గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వాగులోకి దూసుకువెళ్లిన కారును, మృతదేహాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను, ఘటన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత గుంటూరు ప్రభుత్వాస్పతికి చేరుకుని క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం, అర్హులైన వారికి వైఎస్సార్‌ బీమా పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. వీరిలో అర్హులైన వారికి ఉగాది రోజున ఇళ్ల పట్టాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

ముఠా కార్మికుల ఉసురు తీసిన లారీ
మిర్చి లారీ క్వారీ గుంతలో బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మిర్చి లోడు లారీ గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని శ్రీరాంపురం తండా నుంచి బోదిలవీడు మీదుగా మాచర్లకు వస్తుండగా చలమల–శ్రీరాంపురం తండా మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. మాచర్ల నుంచి ముఠా కూలీలను తీసుకెళ్లి చలమల ప్రాంతానికి తీసుకెళ్లి మిరపకాయలను లారీలో లోడు చేశారు. తిరుగు ప్రయాణంలో లోడుతో వస్తున్న లారీ శ్రీరాంపురం తండా సమీపంలోని నాపరాయి క్వారీ వద్ద అదుపు తప్పి గుంతలోకి బోల్తా పడింది. బోల్తా పడిన లారీ నుజ్జునుజ్జవగా.. దానిపై ప్రయాణిస్తున్న ముఠా కూలీలు చెల్లాచెదురుగా క్వారీలో పడిపోయారు.
శ్రీరామపురం వద్ద క్వారీ గుంతలోకి బోల్తాపడిన లారీ 

ప్రమాదంలో బోదిలవీడు గ్రామానికి చెందిన సాధనాల శ్రీహరి (25), సాధనాల శ్రీను (35), రెంటచింతలకు చెందిన డ్రైవర్‌ ఎస్‌కే సమీర్‌ (19) అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా బోదిలవీడుకు చెందిన నాయుడు సాంబయ్య (65) మరణించాడు. ప్రమాదంలో బోదిలవీడు గ్రామానికే చెందిన ముఠా కూలీలు నాయుడు వెంకటనారాయణ, బొల్లినేని నాగేశ్వరరావు, మానిపల్లి కోటయ్య, దోనాదుల మల్లికార్జునరావు, కోకా నరసింహారావు, తాటికొండ నరసయ్య గాయపడ్డారు. వారిని తొలుత మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. డీఎస్పీ శ్రీహరిబాబు, సీఐలు రాజేశ్వరరావు, భక్తవత్సలరెడ్డి, ఎస్సై చెన్నకేశవులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ట్రాక్టర్‌ ప్రమాదంలో 10 మందికి గాయాలు 
తెనాలి:  ట్రాక్టర్‌ అదుపు తప్పి ట్రక్కు ఒరిగిన ఘటనలో 10 మంది గాయపడ్డారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం రావికంపాడు ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివి. వేమూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సూరేపల్లికి చెందిన సుమారు 20 మంది ట్రాక్టర్‌లో వెళ్లారు. తిరిగి అదే ట్రాక్టర్‌లో వారంతా గ్రామానికి బయలుదేరగా.. కొల్లూరు మండల గ్రామం రావికంపాడు వద్ద ఆ ట్రాక్టర్‌ అదుపు తప్పి, ట్రక్కు ఒరిగిపోయింది. ప్రమాదంలో డ్రైవర్‌ సహా 10 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన యేమినేని అంకమ్మ (53), యేమినేని భారతి (60)లను గుంటూరులోని జిల్లా సమగ్ర వైద్యశాలకు తరలించగా.. మిగిలిన వారికి తెనాలి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

నాలుగు పల్టీలు కొట్టి వాగులోకి దూసుకెళ్లింది
నాది చిలకలూరిపేట. తెలిసిన వాళ్లను కలిసేందుకు ఇటువైపు వస్తున్నా. నేను బ్రిడ్జి దాటుతుండగా.. ముందు వెళుతున్న వాహనాన్ని దాటించబోయిన టవేరా కారు అదుపుతప్పింది. పక్కనున్న చెత్త కుప్పల మీదుగా నాలుగు పల్టీలు కొట్టుకుంటూ వాహనం గాలిలోకి లేచింది. చెట్లను విరుచుకుంటూ పొదల్లోకి దూసుకెళ్లింది. అంతలోనే వాగులోంచి పెద్దగా కేకలు, ఏడుపులు, అరుపులు వినిపించాయి. నేను భయపడిపోయా. కాళ్లూ చేతులూ వణికిపోయాయి. కారువైపు చూస్తే అంతా రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇంతలో రోడ్డుపై వెళ్లేవాళ్లు ఆగి చనిపోయిన వారిని, క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. ఇదంతా రెప్పపాటులోనే నా కళ్ల ముందు జరిగిపోయింది. చూస్తుండగానే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.     
– బి.శివ, ప్రత్యక్ష సాక్షి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement