సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లు నేరవేర్చాలంటూ శుక్రవారం నుంచి లారీల యజమానులు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం లారీల యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. అవి సఫలమవ్వకుంటే ఈ అర్ధరాత్రి నుంచే ఎక్కడికక్కడ లారీలకు బ్రేక్ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.30 లక్షల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. అదే జరిగితే రెండు మూడ్రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది.
ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలతో అక్కడి నుంచి కూరగాయల సరఫరా తగ్గుముఖం పట్టగా, లారీల సమ్మెతో అది మరింత తీవ్రం కానుంది. టమాటా ధర బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.35 పలుకుతుండగా, మిర్చి కిలో రూ.110కి చేరింది. మిగతా కూరగాయలు ధరలు సైతం ఇప్పటికే రూ.20 నుంచి రూ.40 వరకు ఉండగా అవన్నీ క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. వీటితో బియ్యం, పప్పులు ఇతర సరుకులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
ప్రధాన డిమాండ్లివే..
డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలంటూ దేశవ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి మూడు నెలలకోసారి సవరించాలని లారీల యజమానులు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే టోల్‌గేట్లు తొలగించాలని, పెంచిన థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించాలని, టీడీఎస్ వసూలు రద్దు చేయాలన్నవి మిగతా ప్రధాన డిమాండ్లు. దీంతో పాటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలుచేయాలని, అలాగే ప్రమాదం లేదా ఓవర్‌లోడ్ విషయంలో డ్రైవర్ లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు. వీటన్నింటిని సత్వరమే పరిష్కరించాలని కోరుతూ లారీల యజమానులు సమ్మె తలపెట్టారు.
ధరలు పైపైనే..
ఇప్పటికే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. లారీల సమ్మెతో ధరలు పెరిగితే సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా టమాట ధర మార్కెట్‌లో కిలో రూ.35 పలుకుతోంది. ప్రతి ఏటా జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి 500 టన్నుల మేర టమాట వస్తుండగా అది ప్రస్తుతం 200 నుంచి 300 టన్నులకు పడిపోయింది. తాజా సమ్మెతో మదనపల్లి నుంచి సరఫరా ఆగిపోతే ధరలు మరింత పెరిగే అవకాశముంది. హైదరాబాద్ పరిధిలోని మొజాంజాహీ మార్కెట్, గడ్డి అన్నారం, బోయిన్‌పల్లి మార్కెట్లకు సరుకు రవాణా ఆగిపోనుంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయాలు, పండ్లు సరఫరా చేసే లారీలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్న నేపథ్యంలో వాటి ధరలకు రెక్కలొచ్చే ప్రమాదముంది. ఇక మిర్చి ధర ఇప్పటికే ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం కిలో మిర్చి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రూ.95 వరకు ఉండగా, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రూ.110 మించి పలుకుతోంది. అలాగే కాకర కిలో రూ.25, వంకాయ రూ. 25, క్యాప్సికం రూ.40, గోబీ రూ.30, బెండకాయ రూ.25 ఉండగా.. సమ్మెతో వీటి ధరలు పెరగనున్నాయి.
తగ్గిన ఉల్లి సరఫరా..
ఇక రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగ్గా ఉల్లి సరఫరా తగ్గింది. ప్రస్తుతం లారీ రవాణా ఆగితే ఉల్లి ధరల పెరిగే అవకాశముంది. ఇక బియ్యం, పప్పులు, నూనెలపై ధరల ప్రభావం ఎలా ఉంటుందన్నది సమ్మె కాలాన్ని బట్టి ఉంటుందని మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. ఇక రేషన్ లబ్ధిదారులకు పీడీఎస్ బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇప్పటికే 80శాతం బియ్యం సరఫరా ముగిసినందున సమస్య ఉత్పన్నం కాదని పౌర సరఫరాల శాఖ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment