ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వాహనాలు
సాక్షి, విజయనగరం : జిల్లాలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద కోల్‌కతా చెన్నై జాతీయ రహదారిపై బుధవారం రెండు లారీలు, బస్సు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 30 మందిపైగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు బస్సు పూర్తిగా అదుపుతప్పి బోల్తా పడింది. రెండు లారీల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న గ్రామస్థులు కేబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్లను బయటకు లాగారు.
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని కోడూరు గ్రామానికి చెందిన సుమారు అరవై మంది భక్తులు కాశీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరుకు మరో రెండు గంటల్లో చేరుకుంటారనగా ఈ దుర్ఘటన జరిగింది. బోల్తా పడిన బస్సులో పలువురు లోపలే ఇరుక్కుపోయారు. లారీడ్రైవర్లు క్యాబిన్‌లోనే చిక్కుకుపోయారు. సహాయం కోసం బాధితులు చేస్తున్న ఆర్తానాదాలు మిన్నంటాయి. అందుబాటులో ఒకే అంబులెన్స్ ఉండటంతో సహాయక చర్యలు మందగొడిగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి ఆరా
విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా జర్మనీలో ఉన్న ఆయన ప్రమాద ఘటనపై విజయనగరం జిల్లా ఎస్పీని ఫోనులో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాల కోసం అదనపు పోలీసు బలగాలను ఘటన స్ధలానికి తరలించాలని ఎస్పీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment