ప్రవీణ్, రోజా పెళ్లినాటి ఫొటో (ఫైల్)
ఆ వధూవరులకు వివాహమై తొమ్మిది నెలలే అయ్యింది. కొత్త జీవితంలోకి అడుగిడిన వారు ఆనందంగా.. సంతోషాల సంబరంగా ఉన్న దాంట్లో సంతృప్తితో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వరుడు దుర్మరణం పాలయ్యాడు. కాళ్లపారాణి ఆరక ముందే భర్త దుర్మరణం చెందడంతో ఆ నవ వధువు కన్నీరుమున్నీరవుతోంది. ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే...
సాక్షి, విజయనగరం(కొమరాడ/సీతానగరం): కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన గొబ్బరు వెంకటరమణ, జయలక్ష్మి దంపతుల మొదటి సంతానం గొబ్బరు ప్రవీణ్(27), రెండో సంతానం ప్రదీప్. వీరంతా కూరగాయల సాగు చేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రవీణ్‌కు ఇదే పంచాయతీ కందివలసకు చెందిన మార్కొండ రామచంద్ర, చిన్నమ్మడు దంపతుల కుమార్తె రోజాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. రామచంద్ర కొన్నాళ్ల కిందట బతుకు జీవనం కోసం కుటుంబ సభ్యులతో ఏలూరు వెళ్లిపోయారు. ప్రవీణ్ పండిన కూరగాయాలను బొబ్బిలి మార్కెట్‌కు బొలేరో వాహనంలో మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి తీసుకువెళ్లేందుకు బయలుదేరాడు
మార్గంలో సీతానగరం మండలం ఎన్‌సీఎస్ సుగర్స్ వద్ద కింతలిపేట రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని బొలేరో ఢీకొంది. దీంతో బొలేరోలో ప్రయాణిస్తున్న ప్రవీణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రవీణ భార్య ఆరు నెలల గర్భిణి. ప్రవీణ్ పెద్ద కొడుకు కావడంతో కుటుంబ జీవనంలో తన వంతు పాత్ర పోషిస్తూ తల్లిదండ్రులతో పాటు తమ్ముడు ప్రదీప్, భార్య రోజాను తనకు కలిగినంతలో హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: (నాన్నా... నీ వద్దకే వస్తున్నాం!)
వివాహమైన తొమ్మిది నెలలకే నవ వరుడు ఇలా దుర్మరణం చెందడం, భార్య ఆరు నెలల గర్భిణి కావడంతో అంతా తల్లడిల్లుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటనా స్థలానికి ఇన్‌చార్జి ఎస్‌ఐ సురేంద్రనాయుడు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ఆ లారీ అక్కడే ఉండగా మూడు రోజుల కిందట మోటారు సైకిల్‌తో ఓ విద్యార్థి లారీని ఢీకొని గాయాల పాలయ్యాడు. ఇప్పటికైనా మరమ్మతులకు గురైన లారీని అక్కడ నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (ఇష్టంలేని పెళ్లి.. నవవధువు బలవన్మరణం)
Comments
Please login to add a commentAdd a comment