కొత్త రాష్ట్రం.. కొత్త రూల్స్!
* ఏకీకృత సర్వీస్ రూల్స్, నిబంధనల సరళీకరణపై సర్కారు దృష్టి
* మండల, జిల్లా పరిషత్ టీచర్లకు స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తింపు
* తద్వారా ఉపాధ్యాయులందరికీ ఒకే రూల్స్ తెచ్చే యోచన
* మార్పుచేర్పులకు అవకాశమిస్తున్న రాష్ర్ట విభజన చట్టం
* అధికార వర్గాల కసరత్తు, చివరగా రాష్ర్టపతి ఆమోదం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు తీరని కోరికగానే మిగిలిపోయిన ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు రాష్ట్ర విభజన చట్టమే మార్గం చూపుతోందా? ఈ చట్టాన్ని అధ్యయనం చేస్తున్న అధికార వర్గాలు, ఉపాధ్యాయ సంఘాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏకీకృత రూల్స్ ఆచరణ సాధ్యమేనని చెబుతున్నాయి. రాష్ర్టపతి ఉత్తర్వులు అక్కర్లేకుండానే దీన్ని అమల్లోకి తీసుకురావచ్చుననీ, చివరి దశలో రాష్ట్రపతి ఆమోదం అవసరముంటుందని చెబుతున్నాయి. ఈ మేరకు కొత్త రాష్ర్టంలో కొత్త సర్వీసు రూల్స్ అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రస్తుతమున్న నిబంధనల సరళీకరణపై కసరత్తు మొదలుపెట్టింది. ఉపాధ్యాయుల విషయంలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ని తెస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ర్ట విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ప్రస్తుతమున్న రూల్స్‌ను యథాతథంగా లేదా సవరణలతో రెండేళ్లలో వర్తింపజేసుకోవాల్సి ఉంది. దీని ఆధారంగా ఉద్యోగుల ప్రాథమిక, విధానపరమైన, సెలవు సంబంధిత నిబంధనల సరళీకరణతోపాటు ఏకీకృత సర్వీసు రూల్స్‌పై రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మండల పరిషత్(ఎంపీ), జిల్లా పరిషత్(జెడ్పీ) టీచర్ల కేడర్‌ను స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇంకా బ్రిటీష్ కాలంనాటి నిబంధనలే..
బ్రిటీష్ కాలం(1933)లో అప్పటి మద్రాసు రాష్ట్రంలో అమలు చేసిన ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌నే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలోనూ పెద్దగా మార్పులు చేయలేదు. ఓక్కో శాఖలో ఒక్కో రకంగా రూల్స్ ఉండటం, అంశాలవారీగా కూడా వేర్వేరు నిబంధనలు ఉండటంతో వివాదాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం లీవ్ రూల్స్, క్రమశిక్షణా ఉల్లంఘన కేసులకు సంబంధించి సీసీఏ రూల్స్, నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వేర్వేరు రూల్స్, మినిస్ట్రియల్ సర్వీసు రూల్స్, స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్, విభాగాల వారీగా మినహాయింపులు పొందిన రూల్స్ వంటివి వేర్వేరుగా అమల్లో ఉన్నాయి.
దీంతో వీటిని వీలైనంతగా సరళీకరించేందుకు, ఏకీకృతం చేసేందుకు తెలంగాణ సర్కారు క సరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎంఈవో, డీఈవో పోస్టులను స్టేట్ లోకల్ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా గుర్తించారు. కానీ మండల, జిల్లా పరిషత్ టీచర్లు మాత్రం స్థానిక సంస్థల పరిధిలోనే ఉన్నారు. దీంతో వీరికి వేర్వేరు రూల్స్ అమలులో ఉన్నాయి.
నిజానికి వీటన్నింటినీ ఏకీకృతం చేసేందుకు 1981లోనే అప్పటి ప్రభుత్వం జీవో 168ని జారీ చేసింది. అయితే అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకోలేదు. అయితే ఎంఈవో, డీఈవో పోస్టుల్లో ఎంపీ, జెడ్పీ టీచర్లు వస్తే తమకు నష్టం జరుగుతుందని, పైగా సర్వీసు రూల్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయని అడ్డు చెప్పారు. దీంతో హైకోర్టు కూడా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించింది. ఆ తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం అక్కడే పెండింగ్‌లో ఉంది.
విభజన నేపథ్యంలో మార్పులపై కసరత్తు
రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త సర్వీసు రూల్స్ రూపొందించుకునే అవకాశం చిక్కింది. నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మార్పులు చేయొచ్చు. అవసరమైతే కొత్తవి రూపొందించుకోవచ్చు. దీంతో ఈ అంశంపై త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇక టీచర్ల ఏకీకృత రూల్స్ విషయంలో మండల, జిల్లా పరిషత్ టీచర్ పోస్టులను కూడా రాష్ర్ట స్థాయి లోకల్ కేడర్‌గా మార్చాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా టీచర్లందరికీ ఒకే సర్వీసు రూల్స్‌ని తేవచ్చునని భావిస్తోంది. దీనిపై విద్యా శాఖ అధికారులు కమిటీగా ఏర్పడి ఏకీకృత సర్వీసు రూల్స్‌పై ముసాయిదాను రూపొందించే యత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.