‘అవిశ్వాసం’ సమావేశం రసాభాస
తాండూర్ : మండల కేంద్రమైన తాండూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన సమావేశం రసాభాసగా మారింది. చైర్మన్ బోనగిరి చంద్రశేఖర్‌పై జూలై 15న అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ 11 మంది డెరైక్టర్లు డివిజనల్ కో ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు సహకార సంఘం అధికారులు ఆగస్టు 11న అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో సమావేశం వాయిదా పడింది.
తాజాగా చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బుధవారం స్థానిక సంఘ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సమావేశం నిర్వహించారు. చైర్మన్‌తో సహా 13 మంది సభ్యులు హాజరయ్యారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ చైర్మన్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ క్రమంలో పలువురు సభ్యులు, చైర్మన్‌కు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఎస్సై అజయ్‌బాబు వారిని శాంతింపజేశారు. అనంతరం అవిశ్వాస తీర్మానంపై డీఎల్సీవో ప్రభాకర్ ఓటింగ్ నిర్వహించారు. కోర్టు ఆదేశాల మేరకు ఫలితాన్ని ప్రకటించకుండా డిసెంబర్ 3వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో సహకార సంఘం సూపరింటెండెంట్ జగదీశ్, అధికారులు అనిల్‌కుమార్, రవికిషోర్, హిమామ్ తదితరులు పాల్గొన్నారు.