అఫిడవిట్...ఏమార్చారు
మచిలీపట్నం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శిష్ట్లా రమేష్ నిర్వాకం
గుడివాడ వన్‌టౌన్‌లో క్రిమినల్ కేసు
రెండు విలువైన స్థిరాస్తుల వివరాలు నిల్
భన్వర్‌లాల్‌కు గుడివాడ వాసి ఫిర్యాదు
ఆయనపై ఎక్కడా కేసులు లేవట. ఎలాంటి విచారణలు, కేసులుగానీ పెండింగ్‌లో లేవట.. ఆయనో న్యాయవాది. కనీసం పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (పాన్ కార్డు) లేదట...! ఇదీ మచిలీపట్నం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి శిష్ట్లా రమేష్ దాఖలు చేసిన అఫిడెవిట్‌లో పొందుపరచిన సమాచారం. స్క్రూట్నీ సమయంలో ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో అధికారులు అఫిడవిట్‌ను అమోదించారు. కానీ వాస్తవానికి రమేష్‌పై గుడివాడలో ఒక క్రిమినల్ కేసు, ఆఫిడవిట్లో చూపని రెండు స్థిరాస్తులున్నాయి. వీటిని స్థానికంగా ఒకరు గుర్తించి సమగ్ర ఆధారాలతో సహ ఎన్నికల కమిషనర్‌తో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బట్టబయలయింది.
సాక్షి, విజయవాడ: శిష్ట్లా రమేష్‌బాబు కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా 19వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో సిర్థాస్తులు, బంగారం, నగదు ఇలా అన్ని అంశాలను ప్రకటించారు. మొత్తం 70లక్షలు స్థిరాస్తులు తనపేరిట, తన భార్య పేరిట 10లక్షల స్థిరాస్తులు,3లక్షల చేతిలో నగదు, మరో3లక్షలు అప్పుగా ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. ఉన్న స్థిరాస్తులు కూడా హైదరాబాద్, చిత్తూరులో ఉన్నట్లు చూపారు. వీటితో పాటు తనపై ఎక్కడా క్రిమినల్ కేసులు నమోదవడం కానీ, క్రిమినల్ విచారణలు కానీ పెండింగ్‌లో లేవని ప్రకటించారు.
అయితే గుడివాడ వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో క్రైం నంబర్ 7/2011 నంబరుతో క్రిమినల్ కేసు నమోదయింది. గుడివాడలోని శాంతినగర్‌కు చెందిన ఎం. లక్ష్మణరావు అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ దాఖలు చేశారు. గుడివాడ కోర్టు వన్‌టౌన్ పోలీసులను క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించటంతో కేసు నమోదయింది. వెంటనే రమేష్ హైకోర్టు నుంచి కేసు నిలుపుదల చేస్తూ స్టే ఉత్తర్వులు తీసుకొచ్చారు.
ఎంపీ అభ్యర్థి రమేష్ కారును అపహరించారనేది నమోదయిన కేసు సారాంశంగా ఉంది. అయితే గుడివాడలో రెండు సిర్థాస్తులు కూడా ఉన్నాయి. వీటిని కూడా అఫిడవిట్లో చూపలేదు. 2004 సంవత్సరంలో గుడివాడ పట్టణంలో మార్కెట్ విలువ రూ 3.22 లక్షలు విలువచేసే 227 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అదికూడా రమేష్ పేరిటే కొనుగోలు చేశారు. అలాగే గుడివాడ పట్టణంలోడోర్‌నంబరు 4/22బిలో ఉన్న 638 చదరపు గజాల స్థలంలో ఉన్న శ్రీశ్రీనివాసరైస్, డాల్ మిల్లును 2006లో కొనుగోలు చేశారు.
దీని మార్కెట్ విలువ రూ 29లక్షలుగా ఉంది. బహిరంగ మార్కెట్లో ఈ రెండు ఆస్థుల విలువ సుమారు రెండు కోట్లపైనే ఉంటుందని సమాచారం. ఈ రెండు ఆస్థులు, క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో చూపించలేదు. అలాగే అఫిడవిట్లో తనకు పాన్‌కార్డు తనకు లేదని చూపారు. కానీ 2006 నుంచే ఆయనకు పాన్ కార్డు ఉంది. ఏఈఏపీఎస్7184ఎం నంబరుతో పాన్‌కార్డును వినియోగిస్తున్నారు.
భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు...
గతంలో రమేష్‌పై ప్రైవేట్ కేసు దాఖలు చేసిన లక్ష్మణరావు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కి రాతపూర్వక ఫిర్యాదు పంపారు. వాస్తవానికి స్క్రూట్నీ సమయంలో ఇతనిపై ఆధారాలతో ఫిర్యాదులను కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భన్వర్‌లాల్‌కు పంపారు. అయితే ఫ్యాక్స్, మెయిల్ ద్వారా పంపండతో వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అన్ని అధారాలతో మళ్లీ ఫిర్యాదు చేసి ఎంపీ అభ్యర్థి రమేష్‌ను అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.