Sitaramalaksmi
-
ఆరని సీట్ల చిచ్చు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో సీట్ల చిచ్చు రగులుతూనే ఉంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు, పాత వారి మధ్య విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీటు హామీతో పార్టీలో చేరిన వారు దర్జాగా తిరుగుతూ నియోజకవర్గాల్లో క్యాడర్‌పై పెత్తనం చెలాయించడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సీటు ప్రశ్నార్థకంగా మారడంతోపాటు ఇతర నేతలు తమ క్యాడర్‌ను దగ్గరకు తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వారికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో వలస నేతలపై విమర్శలు చేయడంతో పాటు అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. భీమవరం సీటు తనకే వస్తుందనుకున్న మెంటే పార్థసారథిపై ఆశలపై నీళ్లు చల్లుతూ ఎమ్మెల్యే అంజి బాబును పార్టీలోకి చేర్చుకోవడంతో అక్కడి రాజకీయం మారిపోయింది. సారథి వర్గం ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కొం దరు కీలక నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన చంద్రబాబును కలవనున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాత్రం అంజి బాబుకు సీటు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ రెండు వర్గాలు ఇలా గొడవ పడుతుండగా చంద్రబాబు మాత్రం భీమవరాన్ని బీజేపీకి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో భీమవరం టీడీపీ రాజకీయం రచ్చరచ్చగా మారింది. ఉంగుటూరు సీటు కోసం గన్ని వీరాంజనేయులు కాచుకుని కూర్చోగా దాన్ని అయితే బీజేపీకి లేదా వలస నేతలైన మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ లేదా ఎమ్మెల్యే ఈలి నానికి ఇచ్చేందుకు సిద్ధపడుతుండటం కొత్త వివాదానికి కారణమైంది. తనకు కాకుండా ఎవరికి సీటిచ్చినా ఊరుకునేది లేదని గన్ని వర్గం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. చింతలపూడి సీటు విషయంలోనూ పాత, కొత్త నేతల మధ్య పోరాటం నడుస్తోంది. జెడ్పీ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, పీతల సుజాత ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన కర్రా రాజారావు కూడా సీటు కోసం పోటీ పడుతుండడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివకు ఇవ్వాలా, కొత్తగా పార్టీలోకి వచ్చినా రంగనాథరాజుకి ఇవ్వాలా అనే దానిపై అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి గుబ్బల తమ్మయ్య మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆఖరి నిమిషంలో టీడీపీలో చేరి ఆచంటను ఎగరేసుకుపోవడానికి పితాని రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ సీటును రెండు నెలల క్రితమే చంద్రబాబు గుబ్బల తమ్మయ్యకు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇప్పుడు పితానికి ఇచ్చేయాలని నిర్ణయించడంతో తమ్మయ్య ఎదురుతిరి గారు. నియోజకవర్గ టీడీపీ అంతా పితానిని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆచంట సీటు ఎవరికి ఇవ్వాలో తెలియక అధిష్టానం సంది గ్ధంలో పడింది. ఇలా కొత్త, పాత నేతలు సీట్లకోసం పట్టుబడుతుం డడం, విభేదించుకోవడంతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. -
టీడీపీలో వర్గపోరు!
భీమవరం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భీమవరంలోని టీడీపీలో ముసలం ఏర్పడింది. నియోజకవర్గంలోని ప్రధాన నేతలు నాలుగు గ్రూపులుగా ఏర్పడి నువ్వానేనా అన్నట్టు పోరు సాగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో ప్రజల మద్దతు కోల్పోతున్న ఈ పార్టీ వర్గపోరుతో మరింత బజారున పడింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ వర్గపోరు బహిర్గతమైంది. ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీది భీమవరమే కావడంతో ఆమె నాయకత్వాన్ని సైతం నియోజకవర్గంలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి అభ్యర్థిగా రేసులో ఉంటారని చెబుతూ వచ్చిన సీతమ్మ అనూహ్యంగా ప్లేటు ఫిరాయించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రచారం సాగించడంతో ఇప్పటికే సీటును ఆశిస్తున్నవారు ఖంగుతిన్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో నిలుచుని ఓటమిని చవిచూసిన ప్రస్తుత పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మెంటే పార్థసారధి, పట్టణ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరావు(బండిశ్రీను) వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సీతారామలక్ష్మీ ఇంటికి ఈ నేతలంతా వెళ్లకుండా డుమ్మా కొట్టారు. దీనితో వర్గపోరు బహిర్గతమైంది. ఓటమి చెందినా పార్టీని అంటిపెట్టుకుని నియోజకవర్గంలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్నానని తనకు సీటు ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడమేమిటంటూ గాదిరాజు బాబు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సీటు అడిగే దమ్ము, సత్తా తనకే ఉన్నాయంటూ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మెంటే పార్థసారధి పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపించారు. పార్టీలో 30 ఏళ్ల సర్వీసున్న తనకే సీటు ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. వీరు ఇలా ఉండగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శ్రీను ఇస్తే గాదిరాజు బాబు, మెంటే పార్థసార ధిలలో ఒకరికి సీటు ఇవ్వండి లేదా నాకివ్వండి అంటూ ఇటీవల ప్రారంభించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కార్యకర్తల ముందు ప్రకటించినట్టు తెలిసింది. దీనితో వర్గపోరు ముదురు పాకాన పట్టింది. సీతమ్మ తీరును మాత్రం వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా నియోజకవర్గంలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేతల వర్గపోరుతో కార్యకర్తలు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఒక వర్గం వారితో వెళితే మిగిలిన వర్గం వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని కరుడుగట్టిన కార్యకర్తలు కూడా ఇంటి దగ్గరే మిన్నకుండిపోతున్నట్లు కొంతమంది వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ అధినేత చంద్రబాబు గోడమీద పిల్లి వైఖరే కారణమని పలువురు ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా పేర్కొంటున్నారు. ఈ వర్గపోరు భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడవలసిందే. -
సీతమ్మ వాకిట్లో.. వర్గాల చీకట్లో.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా టీడీపీలో వర్గపోరు రాజ్యమేలుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడుగా వ్యవహరించాల్సిన ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి స్తబ్దుగా ఉండిపోవడం చర్చనీయూంశంగా మారింది. రాష్ట్ర విభజన అంశంలో పార్టీ అధిష్టానానికి స్పష్టత లేకపోవడం.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో తెలియకపోవడంతోపాటు అంతర్గతంగా నెలకొన్న వర్గ రాజకీయూలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో సీతారామలక్ష్మి కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ గతంలో మాదిరిగా చురుగ్గా పాల్గొనడం లేదు. అధిష్టానం ఇచ్చే పిలుపులకు మొక్కుబడిగా స్పందించడం, కీలక సమావేశాలకు సైతం ఏదో వంకతో గైర్హాజరవుతుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అవకాశం ఎక్కడి నుంచో.. గత సాధారణ ఎన్నికలలో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలైన సీతారామలక్ష్మిని ఈసారి ఏ నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతారనే విషయం సస్పెన్స్‌గా మారింది. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తే భారీగా డబ్బు ఖర్చయ్యే పరిస్థితి ఉండటంతోపాటు ప్రస్తుత పరిణామాల్లో గెలుస్తామో లేదోననే ఆందోళన కూడా ఆమెలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆమెచూపు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంపై పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె నిర్ణయూన్ని భీమవరం నియోజకవర్గ పార్టీ కన్వీనర్ గాదిరాజు బాబు వర్గం వ్యతిరేకిస్తోంది. తమ సీటును ఆమె ఎలా అడుగుతారనే వాదనను ఆ వర్గం వినిపిస్తోంది. దీంతో పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. అధిష్టానం మాత్రం సీతారామలక్ష్మిని ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. భీమవరంలో ఇంటిపోరు సీట్ల వ్యవహారం నేపథ్యంలోనే సొంత నియోజకవర్గమైన భీమవరంలో సీతారామలక్ష్మి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. అది అంతర్గతంగా ముదిరిపాకాన పడినట్లు సమాచారం. తొలినుంచీ గాదిరాజు, రామలక్ష్మి వర్గాల మధ్య సఖ్యత లేదు. దీనికితోడు ఆమె భీమవరం అసెంబ్లీ స్థానంపై కన్నేయడం బాబు వర్గానికి మింగుడుపడటంలేదు. దీనికితోడు కొద్దిరోజుల క్రితం ఉండి నియోజకవర్గానికి చెందిన ఒక ప్రముఖుడి అభ్యర్థిత్వాన్ని నరసాపురం ఎంపీ స్థానానికి పరి శీలించాలని గాదిరాజు బాబు అధిష్టానం వద్దకు తీసుకెళ్లడం సీతారామలక్ష్మి వర్గానికి ఇబ్బందికరంగా మా రింది. తనకు అవకాశం ఉన్న స్థానానికి వేరే వ్యక్తిని పరిశీలించాలని సూచించడాన్ని రామలక్ష్మి వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గాదిరాజు వర్గంతో సంబంధాలు ఇంకా దెబ్బతిన్నాయి. జిల్లాలోనూ ఆధిపత్య పోరు మరోవైపు జిల్లాలో పార్టీ శ్రేణులపై ఆధిపత్యం కోసం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మాగంటి బాబుతో సీతారామలక్ష్మి పోటీపడక తప్పలేదు. దీంతో మొదటి నుంచీ రెండు వర్గాల మధ్య విభేదా లు పెరిగిపోయాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తు లతో ముందుకెళ్లారు. సీతారామలక్ష్మికి రెండోసారి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి దక్కకుండా చేసేందుకు బాబు వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆమెకే ఆ పదవి దక్కింది. రెండోసారి పదవినైతే దక్కించుకున్నా సీతారామలక్ష్మి పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోగా నామమాత్రంగా మారిపోవడం విశేషం. దీనికి ప్రత్యర్థుల ఎత్తులతోపాటు విభజన వ్యవహారంలో పార్టీ వైఖరి కూడా కారణమని తెలుస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో ప్రజలకు ఏంచెప్పాలో తెలియక ఆమె పెద్దగా బయటకు రాలేదు. అడపాదడపా సమైక్య ఆందోళనల్లో పాల్గొన్నా నోరు విప్పడానికి భయపడేవారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన కూడా ఆమెను వెంటాడుతున్నట్లు చెబుతున్నారు.