సీతమ్మ వాకిట్లో.. వర్గాల చీకట్లో.
Published Mon, Dec 9 2013 2:38 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా టీడీపీలో వర్గపోరు రాజ్యమేలుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడుగా వ్యవహరించాల్సిన ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి స్తబ్దుగా ఉండిపోవడం చర్చనీయూంశంగా మారింది. రాష్ట్ర విభజన అంశంలో పార్టీ అధిష్టానానికి స్పష్టత లేకపోవడం.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో తెలియకపోవడంతోపాటు అంతర్గతంగా నెలకొన్న వర్గ రాజకీయూలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో సీతారామలక్ష్మి కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ గతంలో మాదిరిగా చురుగ్గా పాల్గొనడం లేదు. అధిష్టానం ఇచ్చే పిలుపులకు మొక్కుబడిగా స్పందించడం, కీలక సమావేశాలకు సైతం ఏదో వంకతో గైర్హాజరవుతుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అవకాశం ఎక్కడి నుంచో.. గత సాధారణ ఎన్నికలలో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలైన సీతారామలక్ష్మిని ఈసారి ఏ నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతారనే విషయం సస్పెన్స్‌గా మారింది. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తే భారీగా డబ్బు ఖర్చయ్యే పరిస్థితి ఉండటంతోపాటు ప్రస్తుత పరిణామాల్లో గెలుస్తామో లేదోననే ఆందోళన కూడా ఆమెలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆమెచూపు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంపై పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె నిర్ణయూన్ని భీమవరం నియోజకవర్గ పార్టీ కన్వీనర్ గాదిరాజు బాబు వర్గం వ్యతిరేకిస్తోంది. తమ సీటును ఆమె ఎలా అడుగుతారనే వాదనను ఆ వర్గం వినిపిస్తోంది. దీంతో పార్టీలో కొంత గందరగోళం నెలకొంది. అధిష్టానం మాత్రం సీతారామలక్ష్మిని ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భీమవరంలో ఇంటిపోరు
సీట్ల వ్యవహారం నేపథ్యంలోనే సొంత నియోజకవర్గమైన భీమవరంలో సీతారామలక్ష్మి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. అది అంతర్గతంగా ముదిరిపాకాన పడినట్లు సమాచారం. తొలినుంచీ గాదిరాజు, రామలక్ష్మి వర్గాల మధ్య సఖ్యత లేదు. దీనికితోడు ఆమె భీమవరం అసెంబ్లీ స్థానంపై కన్నేయడం బాబు వర్గానికి మింగుడుపడటంలేదు. దీనికితోడు కొద్దిరోజుల క్రితం ఉండి నియోజకవర్గానికి చెందిన ఒక ప్రముఖుడి అభ్యర్థిత్వాన్ని నరసాపురం ఎంపీ స్థానానికి పరి శీలించాలని గాదిరాజు బాబు అధిష్టానం వద్దకు తీసుకెళ్లడం సీతారామలక్ష్మి వర్గానికి ఇబ్బందికరంగా మా రింది. తనకు అవకాశం ఉన్న స్థానానికి వేరే వ్యక్తిని పరిశీలించాలని సూచించడాన్ని రామలక్ష్మి వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గాదిరాజు వర్గంతో సంబంధాలు ఇంకా దెబ్బతిన్నాయి.
జిల్లాలోనూ ఆధిపత్య పోరు
మరోవైపు జిల్లాలో పార్టీ శ్రేణులపై ఆధిపత్యం కోసం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మాగంటి బాబుతో సీతారామలక్ష్మి పోటీపడక తప్పలేదు. దీంతో మొదటి నుంచీ రెండు వర్గాల మధ్య విభేదా లు పెరిగిపోయాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తు లతో ముందుకెళ్లారు. సీతారామలక్ష్మికి రెండోసారి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి దక్కకుండా చేసేందుకు బాబు వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆమెకే ఆ పదవి దక్కింది. రెండోసారి పదవినైతే దక్కించుకున్నా సీతారామలక్ష్మి పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోగా నామమాత్రంగా మారిపోవడం విశేషం. దీనికి ప్రత్యర్థుల ఎత్తులతోపాటు విభజన వ్యవహారంలో పార్టీ వైఖరి కూడా కారణమని తెలుస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో ప్రజలకు ఏంచెప్పాలో తెలియక ఆమె పెద్దగా బయటకు రాలేదు. అడపాదడపా సమైక్య ఆందోళనల్లో పాల్గొన్నా నోరు విప్పడానికి భయపడేవారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన కూడా ఆమెను వెంటాడుతున్నట్లు చెబుతున్నారు.
Advertisement