టీడీపీలో వర్గపోరు!
Published Mon, Jan 6 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
భీమవరం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భీమవరంలోని టీడీపీలో ముసలం ఏర్పడింది. నియోజకవర్గంలోని ప్రధాన నేతలు నాలుగు గ్రూపులుగా ఏర్పడి నువ్వానేనా అన్నట్టు పోరు సాగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో ప్రజల మద్దతు కోల్పోతున్న ఈ పార్టీ వర్గపోరుతో మరింత బజారున పడింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ వర్గపోరు బహిర్గతమైంది. ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీది భీమవరమే కావడంతో ఆమె నాయకత్వాన్ని సైతం నియోజకవర్గంలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి అభ్యర్థిగా రేసులో ఉంటారని చెబుతూ వచ్చిన సీతమ్మ అనూహ్యంగా ప్లేటు ఫిరాయించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రచారం సాగించడంతో ఇప్పటికే సీటును ఆశిస్తున్నవారు ఖంగుతిన్నారు.
గత ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో నిలుచుని ఓటమిని చవిచూసిన ప్రస్తుత పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మెంటే పార్థసారధి, పట్టణ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరావు(బండిశ్రీను) వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సీతారామలక్ష్మీ ఇంటికి ఈ నేతలంతా వెళ్లకుండా డుమ్మా కొట్టారు. దీనితో వర్గపోరు బహిర్గతమైంది. ఓటమి చెందినా పార్టీని అంటిపెట్టుకుని నియోజకవర్గంలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్నానని తనకు సీటు ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడమేమిటంటూ గాదిరాజు బాబు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సీటు అడిగే దమ్ము, సత్తా తనకే ఉన్నాయంటూ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మెంటే పార్థసారధి పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపించారు. పార్టీలో 30 ఏళ్ల సర్వీసున్న తనకే సీటు ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.
వీరు ఇలా ఉండగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శ్రీను ఇస్తే గాదిరాజు బాబు, మెంటే పార్థసార ధిలలో ఒకరికి సీటు ఇవ్వండి లేదా నాకివ్వండి అంటూ ఇటీవల ప్రారంభించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కార్యకర్తల ముందు ప్రకటించినట్టు తెలిసింది. దీనితో వర్గపోరు ముదురు పాకాన పట్టింది. సీతమ్మ తీరును మాత్రం వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా నియోజకవర్గంలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేతల వర్గపోరుతో కార్యకర్తలు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఒక వర్గం వారితో వెళితే మిగిలిన వర్గం వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని కరుడుగట్టిన కార్యకర్తలు కూడా ఇంటి దగ్గరే మిన్నకుండిపోతున్నట్లు కొంతమంది వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ అధినేత చంద్రబాబు గోడమీద పిల్లి వైఖరే కారణమని పలువురు ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా పేర్కొంటున్నారు. ఈ వర్గపోరు భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడవలసిందే.
Advertisement