ఆరని సీట్ల చిచ్చు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో సీట్ల చిచ్చు రగులుతూనే ఉంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు, పాత వారి మధ్య విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీటు హామీతో పార్టీలో చేరిన వారు దర్జాగా తిరుగుతూ నియోజకవర్గాల్లో క్యాడర్‌పై పెత్తనం చెలాయించడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సీటు ప్రశ్నార్థకంగా మారడంతోపాటు ఇతర నేతలు తమ క్యాడర్‌ను దగ్గరకు తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వారికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో వలస నేతలపై విమర్శలు చేయడంతో పాటు అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
భీమవరం సీటు తనకే వస్తుందనుకున్న మెంటే పార్థసారథిపై ఆశలపై నీళ్లు చల్లుతూ ఎమ్మెల్యే అంజి బాబును పార్టీలోకి చేర్చుకోవడంతో అక్కడి రాజకీయం మారిపోయింది. సారథి వర్గం ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కొం దరు కీలక నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన చంద్రబాబును కలవనున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాత్రం అంజి బాబుకు సీటు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ రెండు వర్గాలు ఇలా గొడవ పడుతుండగా చంద్రబాబు మాత్రం భీమవరాన్ని బీజేపీకి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో భీమవరం టీడీపీ రాజకీయం రచ్చరచ్చగా మారింది.
ఉంగుటూరు సీటు కోసం గన్ని వీరాంజనేయులు కాచుకుని కూర్చోగా దాన్ని అయితే బీజేపీకి లేదా వలస నేతలైన మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ లేదా ఎమ్మెల్యే ఈలి నానికి ఇచ్చేందుకు సిద్ధపడుతుండటం కొత్త వివాదానికి కారణమైంది. తనకు కాకుండా ఎవరికి సీటిచ్చినా ఊరుకునేది లేదని గన్ని వర్గం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. చింతలపూడి సీటు విషయంలోనూ పాత, కొత్త నేతల మధ్య పోరాటం నడుస్తోంది. జెడ్పీ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, పీతల సుజాత ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన కర్రా రాజారావు కూడా సీటు కోసం పోటీ పడుతుండడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివకు ఇవ్వాలా, కొత్తగా పార్టీలోకి వచ్చినా రంగనాథరాజుకి ఇవ్వాలా అనే దానిపై అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆచంట నియోజకవర్గ ఇన్‌చార్జి గుబ్బల తమ్మయ్య మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆఖరి నిమిషంలో టీడీపీలో చేరి ఆచంటను ఎగరేసుకుపోవడానికి పితాని రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ సీటును రెండు నెలల క్రితమే చంద్రబాబు గుబ్బల తమ్మయ్యకు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇప్పుడు పితానికి ఇచ్చేయాలని నిర్ణయించడంతో తమ్మయ్య ఎదురుతిరి గారు. నియోజకవర్గ టీడీపీ అంతా పితానిని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆచంట సీటు ఎవరికి ఇవ్వాలో తెలియక అధిష్టానం సంది గ్ధంలో పడింది. ఇలా కొత్త, పాత నేతలు సీట్లకోసం పట్టుబడుతుం డడం, విభేదించుకోవడంతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది.