పొత్తు పోటు
పొత్తు పోటు
Published Mon, Apr 7 2014 2:53 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీతో పొత్తు జిల్లా తెలుగుదేశం పార్టీకి శరాఘాతంలా తగిలింది. కొందరు నేతల రాజకీయ భవిష్యత్‌ను చిదిమేసింది. చంద్రబాబును నమ్మి సీటుపై ఆశతో కొత్తగా పార్టీలో చేరిన నేతలు తాజా పరిణామాలతో విస్తుపోయి దిక్కులు చూస్తున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంటరీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ బీజేపీకి కేటాయించింది. నరసాపురం పార్లమెంటరీ స్థానాన్ని మొదటి నుంచీ బీజేపీకి వదిలేస్తారని భావించినా తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటును వదులుకోవడం మాత్రం అనూహ్యమైన విషయంగానే విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బీజేపీకి వదిలేస్తారనే ప్రచారం రెండురోజుల నుంచీ సాగుతోంది. బీజేపీ నేతలు ఆ సీటు అడగకపోయినా చం ద్రబాబు ఒత్తిడి చేసి మరీ వారికివ్వడం ఇటీవలే టీడీపీలో చేరిన అక్కడి నేతలను విస్తుపోయేలా చేసింది. చంద్రబాబు వంచనతో వారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది.
కొట్టు, ఈలికి షాక్
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సీటును ఆశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. కొట్టు సత్యనారాయణ దాదాపు మూడు నెలల నుంచి ప్రయత్నాలు చేసి టీడీపీ అధినేతతోపాటు స్థానిక నేతలు వద్దన్నా అందరినీ ఒప్పించి మరీ ఆ పార్టీలోకి వెళ్లారు. తనకే సీటు వస్తుందనే ధీమా మొన్నటివరకూ ఆయనలో కనిపించింది. ఈలి నాని సైతం తనకు మరో చోటైనా సీటిస్తారని ఆశించారు. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న ముళ్లపూడి బాపిరాజుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన్ను జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కొట్టు, ఈలి నానికి మార్గం సుగుమం అయినట్లే కనిపించింది. కానీ.. చివరి నిమిషంలో చంద్రబాబు ఈ సీటును బీజేపీకి ఇచ్చేసి ఇద్దరి నెత్తినా శఠగోపం పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొట్టు సత్యనారాయణ లబోదిబోమంటూ బీజేపీ అగ్రనేతల వద్దకెళ్లి తాను బీజేపీలో చేరతానని.. తనకు సీటివ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడికొండల మాణిక్యాలరావును ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. త్వరలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
రఘురామకృష్ణంరాజుకూ డౌటే!
టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని ముందే ఊహించిన కనుమూరి రఘురామకృష్ణంరాజు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేయూలన్న తలంపుతో.. చంద్రబాబు ఆశీస్సులతో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఇరకాటంలో పడింది. కేంద్ర మాజీ మంత్రి, సినీ ప్రముఖుడు యూవీ కృష్ణంరాజు నరసాపురం పార్లమెంటరీ సీటును ఆశిస్తున్నారు. తాజాగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు కూడా నరసాపురం సీటు కోసం ఢిల్లీలో లాబీయింగ్ నడుపుతున్నారు. ఆయన ఆదివారం ఆఘమేఘాల మీద బీజేపీ సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. బీజేపీ పెద్దలు గంగరాజు అభ్యర్థిత్వం గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రఘురామకృష్ణంరాజు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
అడిగింది ఒకటి.. ఇచ్చింది మరొకటి..
తొలుత బీజేపీ నేతలు ఉంగుటూరు, ఉండి అసెం బ్లీ స్థానాలు అడిగారు. దానికి చంద్రబాబు నిరాకరించి నరసాపురం లేదా తాడేపల్లిగూడెంలో ఏదో ఒకటి తీసుకోవాలని సూచించారు. నరసాపురం అయితే ఉపయోగం ఉండదని తేల్చిన బీజేపీ జిల్లా నేతలు తాడేపల్లిగూడెం కూడా వద్దని కొవ్వూరు, ఏలూరు స్థానాలను తమ పార్టీకి కేటారుుంచాలని కోరారు. కానీ చంద్రబాబు ఆ ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరించి బలవంతంగా తాడేపల్లిగూడెం స్థానాన్ని అంటగట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Advertisement
Advertisement