అంతిమ తీర్పు
సాక్షి, ఏలూరు : సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. ఓటర్లు ఇచ్చిన అంతిమ తీర్పు శుక్రవారం వెలువడనుంది. ఆ తీర్పు ఎలా ఉంటుందనే విషయమై అభ్యర్థులు, ప్రధా న రాజకీయ పార్టీలతోపాటు ప్రజలు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారు గెలుపు తమదంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తిచేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
ఎన్నో అధ్యాయాలు
సార్వత్రిక ఎన్నికల ప్రహసనంలో అనేక అధ్యాయాలు ఉన్నాయి. జిల్లాలోని 2 లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటికి ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేదు. 19వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు. ఆఖరి రెండు రోజుల్లోనే నామినేషన్లు భారీగా పడ్డాయి. ఎంపీ స్థానాలకు 36 మంది, అసెంబ్లీ స్థానాలకు 273 మంది నామినేషన్లు వేశారు. 21న పరిశీలన, 23న ఉపసంహరణ జరిగారుు. ఎంపీ స్థానాల్లో 7, అసెంబ్లీ స్థానాల్లో 110 నామినేషన్లు తిరస్కరణ, ఉపసంహరణకు గురయ్యాయి. చివరకు రెండు ఎంపీ పదవులకు 29 మంది, 15 ఎమ్మెల్యే పదవులకు 163 మంది బరిలో నిలిచారు. ఈనెల 7న నిర్వహించిన పోలింగ్‌లో వీరంతా తలపడ్డారు.
అనివార్యమైన ఎన్నికలు
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిం చింది. అప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అంతకుముందు రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. జనం రోడ్డెక్కారు. పిల్లాపాపలు, అవ్వాతాతలు అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలు రాష్ట్ర విభజనకు నిరసనగా ఉద్యమించారు. పనులు మానుకుని.. పస్తులుంటూ 100 రోజులకుపైగా పోరాడారు. కానీ నాయకులు వారిని వంచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి తెలుగు ప్రజలకు అన్యాయం చేశారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అయినా బీజేపీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం వక్రమార్గంలో విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రజలకు కనిపించిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కనీసం ఆయనను ముఖ్యమంత్రిని చేస్తేనైనా విభజన నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవచ్చని ప్రజలు భావించారు. సరైన సమయం కోసం ఎదురుచూశారు. అప్పుడు వెలువడింది ఎన్నికల నోటిఫికేషన్.
టీడీపీ కుయుక్తులు
సొంత బలం లేదని గ్రహించిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి హవా నడుస్తోందని భావించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీని నమ్మి వెళ్లిన వారిని నట్టేట ముంచేసి సీట్ల కేటాయింపులో విమర్శల పాలైంది. నరసాపురం లోక్‌సభ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించింది. పలుచోట్ల ముందుగా ఇచ్చిన హామీలను కాదని చివరి నిమిషంలో వేరే వాళ్లకు సీటిచ్చింది. దీంతో పాలకొల్లు, కొవ్వూరు, తాడేపల్లిగూడెంలో ఆ పార్టీ రెబెల్ అభ్యర్థులు బరిలోకి దిగారు. మరోవైపు ఎన్నికల్లో ప్రచారం కోసం నరేంద్రమోడీ, సినీనటుడు పవన్‌కల్యాణ్‌లను తెచ్చుకుంది. సామాజిక వర్గాలకు వల వేసింది. డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసింది. బలం లేకపోయినా ధనంతో గెలవాలని ప్రయత్నించింది. చివరకు విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీతోనూ టీడీపీ చీకటి పొత్తు పెట్టుకుంది.