రోడ్డుపై బైఠాయించి నిరసన
ఆనందపేట (గుంటూరు) : సమస్యలు పరిష్కరించాలంటూ పొన్నూరు రోడ్డు వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు సమస్యను పరిష్కరించాలని, కమిషనర్ రావాలని స్థానికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాంట్రాక్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి స్థానికులకు సర్దిచెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వెల్లడించారు. ఇళ్ల ముందు చేరిన మురుగునీటితో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని చెప్పారు. రాకపోకలు సాగించడం నరకంగా మారిందని వాపోయారు. రెండు నెలలుగా మంచినీటి సరఫరా, కరెంటు కోతలతో అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు మురుగునీటిలో జారిపడి గాయాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.