శెభాష్.. పోలీస్
చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ చోరీ సొత్తు స్వాధీనం
181 మంది బాధిత మహిళలకు మంగళసూత్రాలు అందజేత
హైదరాబాద్: దోపిడీ దొంగల ఆటకట్టించడమే కాదు.. వాళ్లు దోచుకున్న సొమ్మును బాధితులకు అందజేసి హైదరాబాద్ పోలీసులు అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. వరుస దొంగతనాలతో నగరాన్ని హడలెత్తించిన మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ నుంచి రికవరీ చేసిన సొమ్మును గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బృందం బాధితులకు అందజేసింది. 181 మంది మహిళలకు మంగళసూత్రాలు తిరిగి ఇచ్చింది. ఈ సందర్భంగా బాధిత మహిళలు పోలీసులను అభినందించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇత ర ఫర్నీచర్‌ను కోర్టు అనుమతితో విక్రయించి మిగతా బాధితులకు న్యాయం చేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. శివ గ్యాంగ్ నుంచి సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు భారీగా సొత్తు రికవరీ చేశారు. రూ. కోటి విలువైన 3.75 కిలోల బంగారు నగలు, రూ. 4.5 లక్షల నగదు, రెండు కార్లు, బైక్, ఫర్నీచర్‌ను నుంచి స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో శివ గ్యాంగ్ రెండేళ్లలో 511 స్నాచింగ్‌లకు పాల్పడింది.
రికవరీ కోసం రెండు నెలలు కష్టపడి..
ఆగస్టు 14న శంషాబాద్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో స్నాచర్ శివ (35) మృతి చెందడంతో ఈ గ్యాంగ్ దొంగతనాలు వెలుగు చూశాయి. వీరు తాకట్టుపెట్టిన బంగారాన్ని ముత్తూట్, శ్రీరామ్‌సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రికవరీ చేసేందుకు పోలీసులు రెండు నెలలు కష్టపడ్డారు. చోరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టుకున్న రెండు ఫైనాన్స్ కంపెనీలు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయి. ఈ కంపెనీల మేనేజర్లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరు మాజీ పోలీసుఅధికారులనూ నిందితుల జాబితాలో చేర్చారు.