Sivampet
-
అన్నదాత ఆత్మహత్య
శివంపేట (మెదక్) : అప్పులబాధ తాళలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కాముని లక్ష్మయ్య(50) సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా... ఇంటికి సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మయ్య తనకున్న ఎకరం పొలంలో పంటల సాగుకు రెండు బోరు బావులు తవ్వించగా నీరు పడలేదు. మరోవైపు కూతురి వివాహానికి, కుటుంబ పోషణ కోసం రూ.3.5 లక్షలు అప్పు చేశాడు. దీంతోపాటు పెళ్లి కావాల్సిన మరో కుమార్తె ఉండడంతో, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక లక్ష్మయ్య మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
శివంపేట(మెదక్): వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్వో మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల సమీపంలో మంగళవారం జరిగింది. చేగుంట మండలం నార్సింగ్ గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న నాగేశ్వర్రావు(45) ఈ రోజు జిల్లా కేంద్రంలో జరగనున్న మీటింగ్కు హాజరయ్యేందుకు తన బైక్ పై బయలు దేరారు. బైక్ చిన్నగొట్టిముక్కల సమీపంలోకి చేరుకోగానే.. నర్సాపూర్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. దీంతో నాగేశ్వర్రావు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యపై యాసిడ్ పోసిన భర్త
మెదక్: సంగారెడ్డి మండలం శివంపేటలో ఓ భర్త తన భార్యపై యాసిడ్ పోశాడు. అతను తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆమెపై యాసిడ్ పోసిన భర్త, అతని స్నేహితులు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.