మార్కులు ఇవ్వలేదని.. టీచర్ పై ఇంకు దాడి
కట్ని: పరీక్షల్లో మంచి మార్కులు వేయలేదని టీచర్ పై కోపం పెంచుకున్న ముగ్గురు అమ్మాయిలు ఆమె ముఖంపై నల్ల ఇంకును చల్లిన ఘటన మధ్యప్రదేశ్ లోని కట్నిలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు పూర్ణిమ ప్యాసి (18), శివాని ప్యాసి (18), పల్లవి అగర్వాల్ (18) ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో సీనియర్ ఇంటర్ (12వ తరగతి) చదువుతున్నారు.
ఫిజిక్స్ సబ్జక్ట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించగా వాటిలో ముగ్గురికి తక్కవ మార్కులు వచ్చాయి. అవమానంగా భావించిన ముగ్గురు మార్కులు తక్కువగా వేసిన టీచర్ పై కోపం పెంచుకున్నారు. మంగళవారం ఫిజిక్స్ లెక్చరర్ రేఖా గుప్తా (35) తరగతి గదికి రావడంతోనే ఆమె ముఖంపై నల్ల ఇంకు చల్లి అవమానించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.