అహోబిలంలో రెచ్చిపోయిన ఆక్రమణదారులు
కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో, మఠం కార్యాలయాలపై ఆక్రమణ దారులు దాడులకు తెగబడ్డారు. అసిస్టెంట్ ఈవో శివరాముడు, మఠం ప్రతినిధులపై కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దిగువ అహోబిలంలో దేవస్థానం భూములను కొందరు ఆక్రమించుకుని నివాసాలు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు.
వీటిని దేవస్థానం వారు తొలగించనున్నారనే ఆందోళనతో ఆక్రమణదారులు గురువారం అర్ధరాత్రి సమయంలో దేవస్థానం ఈవో, మఠం కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ తర్వాత దేవస్థానం అసిస్టెంట్ ఈవో శివరాముడు, మఠం ప్రతినిధులపై కూడా దాడి చేసి పరారయ్యారు. ఈ దాడుల్లో సుమారు 50 మంది వరకు పాల్గొన్నారు. అహోబిలంలో పోలీసు అవుట్‌పోస్ట్ ఉన్నప్పటికీ ఆక్రమణదారులు దాడులు చేయడం గమనార్హం.