sivashankar master
-
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
శివశంకర్ మాస్టర్ పాడె మోసిన ఓంకార్
Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం(నవంబర్29)న పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులు అర్పించారు. కాగా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ యాంకర్, దర్శకనిర్మాత ఓంకార్‌తో పాటు ఆయన తమ్ముడు అశ్విన్ బాబు శివశంకర్ మాస్టర్ పాడె మోశారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఓంకార్- శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన డ్యాన్స్ షోలు అప్పట్లో సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకర్ మాస్టర్ తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. -
బాడీ లాంగ్వేజ్‌పై విమర్శలు.. మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన మాస్టర్ చిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. ఏడాది వయసులో ఓ ప్రమాదంలో వెనుముక తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ సంకల్ప బలంతో డ్యాన్స్ అవ్వాలనుకున్నారు. పట్టుదలతో డ్యాన్స్ నేర్చుకుని నృత్య దర్శకుడు అయ్యారు. చదవండి: Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా? ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివ శంకర్ మాస్టర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలో ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తన డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావలను పలికించే మాస్టర్ 800లకు పైగా చిత్రాలకు పని చేశారు. అలాంటి మాస్టర్‌కు విమర్శలు తప్పలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌పై ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయనపై వచ్చే విమర్శలకు ఓ ఇంటర్వ్యూలో మాస్టర్ తనదైన శైలి సమాధానం ఇచ్చి ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. చదవండి: రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్ ఓ ఇంటర్య్వూలో యాంకర్ తన బాడీ లాంగ్వేజ్‌పై వచ్చి కామెంట్స్‌కు మీ సమాధానం ఏంటని అడగ్గా.. అవన్ని నేను పట్టించుకోనని, వారు అన్నంత మాత్రాన నేను అది అయిపోయిను కదా. నాకంటే ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేగాక ఎవరూ నవ్వితే వారి పళ్లు బయట పడతాయి, ఓ డ్యాన్స్ మాస్టర్‌గా నేను ఇలాగే ఉంటాను. ఫైట్ మాస్టర్‌గా కూలింగ్ గ్లాస్ పెట్టుకని రఫ్‌గా ఉండను. నాలో కళానైపుణ్యం ఉంది. దానికి తగ్గట్టుగానే నేను ఉంటాను. ఎవరు ఏమని కామెంట్ చేసిన నేను పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: Shiva Shankar Master: వెన్నుముక గాయంతో 8 ఏళ్లు మంచానికే, డ్యాన్స్ మాస్టర్ ఎలా అయ్యారంటే.. ఇక తన ముఖంలో రౌద్రం, వినయం, భావోద్యేగం వంటి భావాలను తన ముఖంలో చూపిస్తూ ఇందులో నా ఆర్ట్ కనిపించిందా?, ఆడంగి తనం కనిపించిందా? అని తిరిగి యాంకర్‌ను ప్రశ్నించారాయన. ఇక మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన టీవీయే మీపై ఇలాంటి విమర్శలకు కారణమైందని ఎప్పుడైనా బాధపడ్డారా అనే ప్రశ్నకు.. ఆయన ప్రతి విషయానికి బాధపడుకుంటూ పోతే మనం జీవించలేమన్నారు. ‘నా మనసు మంచిదా? నేను మంచివాడినా? నాలో ఆర్ట్ ఉందా? ధన్యుడనా కాదా అనేదానిపైనే నా దృష్టి ఉంటుంది. నేను ఎటూ చూసిన, ఏం చేసిన, ఏడు నడిచినా అది నా కళ కోసమే, ఈ దారిలో నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అంతగా పట్టించుకోను’ అంటూ తనదైన శైలిలో శివ శంకర్ మాస్టర్ సమాధానం ఇచ్చి విమర్శకుల నోరు మూయించారు. -
శివశంకర్ మాస్టర్ జాతకంలో అలా రాసి ఉంది!
‘మన్మథ రాజా మన్మథ రాజా’... పక్కా మాస్ పాట. ‘రగులుతోంది మొగలి పొద’.... శృంగార గీతం.., ‘ధీర ధీర ధీర మనసాగలేదురా’... మంచి రొమాంటిక్ సాంగ్. ‘దేవ దేవ దేవం భజే’... చక్కని భక్తి పాట... ‘భు భు భుజంగం.. ది ది తరంగం’.... అరాచకుడ్ని అంతం చేయడానికి పాట... పాట ఏదైనా శివ శంకర్ మాస్టర్ ‘స్టెప్’ అందుకు తగ్గట్టే ఉంటుంది. అందుకే ఆయన ‘నృత్యధీర’. వెండితెరపై తారలతో అద్భుతమైన స్టెప్పులేయించిన ఈ మాస్టర్ ‘ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయారు. డ్యాన్స్‌పై మమకారం పెరిగి.. శివ శంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్ పెట్టించారు. దీంతో శంకర్ నేరుగా అయిదో తరగతిలో చేరారు. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్ చేయాలన్న పట్టుదల పెరిగిపోయింది. దాంతో తనంతట తానే డ్యాన్స్ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో వచ్చి తాను డ్యాన్సులు చేయడాన్ని వాళ్ల నాన్నకు చెప్పేశారు. అబద్ధాలు చెప్పడం శివశంకర్ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారు. ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట. ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివశంకర్ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్ అవుతాడు, వదిలెయ్’ అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్ నృత్యం నేర్చుకున్నారు. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్ మాస్టర్ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు. ‘ధీర ధీర’కు జాతీయ అవార్డు రామ్‌చరణ్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’లో ‘ధీర ధీర’ పాటకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్ మాస్టర్ ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. దీంతో పాటు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై శివ శంకర్ మాస్టర్ కనపడితే చాలు నవ్వులు పూసేవి. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘సర్కార్’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. -
సాయం చేసిన కాసేపటికే శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Shiva Shankar Master: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌ను రక్షించుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతగానో ప్రయత్నించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయనను బతికించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, సోనూసూద్ హాస్పిటల్ ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ధనుష్ రూ.10 లక్షలు, చిరంజీవి రూ.3 లక్షల సాయం అందించారు. వీళ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయారు. ఆదివారం సాయంత్రం శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన ఆయన శాశ్వతంగా కన్నుమూశాడని తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇదిలా వుంటే బిగ్‌బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ వేసిన పెయింటింగ్ వేలం పాటలో 20 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ డబ్బునంతా అఖిల్ సర్వింగ్ హ్యాండ్స్ అనే ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. శివశంకర్ మాస్టర్ చికిత్సకు ఈ డబ్బు ఎంతోకొంత ఉపయోగపడుతుందని సదరు ఛారిటీ వాళ్లు దాన్ని నేడు(నవంబర్ 28)సాయంత్రం శివశంకర్ మాస్టర్ కొడుకు అజయ్‌కు విరాళమిచ్చారు. కానీ కాసేపటికే ఆయన కన్నుమూయడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
14న మేడాపురానికి శివశంకర్ మాస్టర్ రాక
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : ఈ నెల 14న చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ రానున్నారు. ఈ మేరకు మండల వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ మెట్టు గోవిందరెడ్డి, ఎస్సీ సెల్ నేత సాలమ్మగారి సాయికృష్ణ తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో 14న తలపెట్టిన గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.