Choreographer Shiva Shankar Master: Biography, Awards, Movies, Detail In Telugu - Sakshi
Sakshi News home page

Shiva Shankar Master: శివశంకర్‌ మాస్టర్‌ జాతకంలో అలా రాసి ఉంది!

Published Sun, Nov 28 2021 9:47 PM | Last Updated on Mon, Nov 29 2021 3:41 PM

Shiva Shankar Master Biography, Awards, Movies - Sakshi

‘మన్మథ రాజా మన్మథ రాజా’... పక్కా మాస్‌ పాట. ‘రగులుతోంది మొగలి పొద’.... శృంగార గీతం.., ‘ధీర ధీర ధీర మనసాగలేదురా’... మంచి రొమాంటిక్‌ సాంగ్‌. ‘దేవ దేవ దేవం భజే’... చక్కని భక్తి పాట... ‘భు భు భుజంగం.. ది ది తరంగం’.... అరాచకుడ్ని అంతం చేయడానికి పాట... పాట ఏదైనా శివ శంకర్‌ మాస్టర్‌ ‘స్టెప్‌’ అందుకు తగ్గట్టే ఉంటుంది. అందుకే ఆయన ‘నృత్యధీర’. వెండితెరపై తారలతో అద్భుతమైన స్టెప్పులేయించిన ఈ మాస్టర్‌ ‘ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయారు.

డ్యాన్స్‌పై మమకారం పెరిగి..
శివ శంకర్‌కు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆయన తండ్రి ట్యూషన్‌ పెట్టించారు. దీంతో శంకర్‌ నేరుగా అయిదో తరగతిలో చేరారు. కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్‌ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్‌ చేయాలన్న పట్టుదల పెరిగిపోయింది.

దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో వచ్చి తాను డ్యాన్సులు చేయడాన్ని వాళ్ల నాన్నకు చెప్పేశారు. అబద్ధాలు చెప్పడం శివశంకర్‌ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారు. ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట.

ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివశంకర్‌ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్‌ అవుతాడు, వదిలెయ్‌’ అని చెప్పారట. దాంతో మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్‌ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్‌ మాస్టర్‌ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు.

‘ధీర ధీర’కు జాతీయ అవార్డు
రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో  వచ్చిన ‘మగధీర’లో ‘ధీర ధీర’ పాటకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్‌ మాస్టర్‌ ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. దీంతో పాటు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక వెండితెరపై శివ శంకర్‌ మాస్టర్‌ కనపడితే చాలు నవ్వులు పూసేవి. తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నవ్వులు పంచారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘సర్కార్’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement