Sivaswamy
-
బ్రహ్మంగారి మఠంపై తేలని నిర్ణయం
బ్రహ్మంగారిమఠం/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్ జిల్లాలోని శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన పీఠాధిపతి నియామకం విషయమై కుటుంబసభ్యుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఫలించలేదు. చర్చలకు సంబంధించిన వివరాలను శివైక్యం చెందిన పీఠాధిపతి వీరభోగ వసంతవేంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి ‘సాక్షి’కి వివరించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు తమ పినతల్లితో తాను, తన సోదరులు పీఠాధిపత్యంపై మాట్లాడినట్లు చెప్పారు. తమ పినతల్లి మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పీఠాధిపత్యం ఆమెకే కావాలని తేల్చిచెప్పారన్నారు. ఒకవేళ లేదంటే పెద్దభార్య రెండో కుమారుడు వీరభద్రయ్యకు అప్పజెప్పాలని సూచించారన్నారు. పెద్దకుమారుడినైన తనకు కావాలంటే బ్రహ్మంగారి గురించి ప్రచారం చేసేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పారన్నారు. ‘ఇంతకుముందు మీ పెద్దకుమారుడికి పీఠాధిపత్యం కావాలన్నారు. ఇప్పుడేమో తెరపైకి మా రెండో తమ్ముడి పేరు ప్రతిపాదిస్తున్నారు. అసలు పీఠాధిపతి కుమారులు అనర్హులు అయినందువల్లే.. పీఠాధిపతి రెండో వివాహం చేసుకున్నారు. తన పిల్లలకు మాత్రమే పీఠాధిపత్యం కావాలని వీలునామా కూడా రాశారు అని గతంలో చెప్పారు కదా..’ అని తమ పినతల్లిని అడిగినట్లు తెలిపారు. దీనిపై తమ పినతల్లి స్పందిస్తూ ‘అది అప్పటిమాట. ఇప్పుడు నాకు రాకపోయినా వీరభద్రయ్యకు రావాలి’ అని చెప్పారన్నారు. లేనిపక్షంలో కోర్టునైనా ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. తాను మాత్రం దేవదాయశాఖ ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయాన్ని అమలు చేయాలని సూచించాం: శివస్వామి బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంలో సంప్రదాయాలను, హిందూధర్మాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు సూచించినట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిసిన శివస్వామి మఠం పీఠాధిపతి వ్యవహారంపై రెండో నివేదికను అందజేశారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మంగారి వారసులు, పలు పీఠాధిపతులు, విశ్వబ్రాహ్మణ సంఘాల వారు, కందిమల్లయ్యపల్లి గ్రామస్తులు, ఉపమఠాల వారి అభిప్రాయాలు, సూచనలతో విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక పక్షాన మంత్రికి రెండో నివేదికను ఇచ్చినట్లు తెలిపారు. హిందూధర్మం, శాస్త్రాలు, పెద్దల మనోభావాల మేరకు పెద్ద కుమారుడికే పీఠాధిపత్యం దక్కాలని సూచించామన్నారు. త్వరలోనే ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారన్నారు. -
‘నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి’
ప్రభుత్వం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. దేవాలయాల కూల్చివేతను నిరసిస్తూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యాన విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పది రోజులుగా శైవక్షేత్రంపై దాడులుచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటూ శైవక్షేత్రానికి రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని చెప్పారు. అధికారం ఉందికదా అని ఏం చేసినా ఫర్వాలేదని ఎమ్మెల్యే విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన హిందూ ధర్మపరిరక్షణకు వెనుకడుగు వేసిది లేదని తేల్చిచెప్పారు. నెలరోజులు గడిచినా దేవాలయాల కూల్చివేతపై మఠాధిపతులు, పీఠాధిపతులకు మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వానికి మరో రెండు రోజులు గడువిస్తున్నామని, ఈలోగా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని శివస్వామి స్పష్టంచేశారు. శనివారం నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పుష్కరాలకు ఆధ్యాత్మిక సేవల సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. -
పుష్కరాలకు సహాయ నిరాకరణ
శివక్షేత్రం పీఠాధిపతి హెచ్చరిక విజయవాడ(వన్‌టౌన్) : విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించకుంటే కృష్ణా పుష్కరాలకు రాజధాని పరిసరాల్లో సహాయ నిరాకరణ చేపడతామని శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హెచ్చరించారు. వన్‌టౌన్‌లోని కొత్తగుళ్లు ప్రాంగణంలో ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతీయ ధర్మానికి మూలమైన హైందవ సంప్రదాయాలను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో అర్ధరాత్రి అక్రమంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది హిందూమతంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం గూండా ల తరహా పాలన చేస్తోందని దుయ్యబట్టారు. దీనికి కారణమైన ఎంపీ తక్షణం రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆలయాలకు దాతలిచ్చిన భూముల్లో సత్రాలు నిర్మిస్తే ఆ ఆస్తులను ప్రభుత్వం అక్రమంగా విక్రయిస్తోందని ఆయన మండిపడ్డారు. నేడు నిరసన ప్రదర్శన ఆలయాల కూల్చివేతకు నిరసనగా ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు శివస్వామి ప్రకటించారు. 40 మంది పీఠాధిపతుల సారథ్యంలో ఈ ప్రదర్శన జరుగుతుందన్నారు. మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు : సత్యానందభారతీస్వామి గన్నవరం: రోడ్ల విస్తరణకోసం రాష్ట్రప్రభుత్వం ఆలయాల్ని ధ్వంసం చేయ డం రాష్ట్రానికే అరిష్టమని శ్రీభువనేశ్వరీ పీఠాధిపతి సత్యానందభారతీస్వామి పేర్కొన్నారు. ఆది వారం ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా 30కిపైగా దేవాలయాల్ని కూల్చివేయడం దారుణమన్నారు. -
పూజారి కలకలం
మదనపల్లె/రూరల్: మదనపల్లెకు చెందిన ఆలయ అర్చకుడు నాలుగురోజుల క్రితం అదృశ్యం కావడం.. శనివారం ఫేస్బుక్లో ఆయన సూసైడ్ నోట్ కనబడడంతో కలకలం రేగింది. ఇంతకూ ఆయన ఏమయ్యాడో తెలియక మదనపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేగింది. తమ చావుకు ఆలయ కమిటీ సభ్యులే కారణమని తాము నమ్ముకున్న బాబా పాదాలచెంతకే శాశ్వతంగా వెళ్లిపోతున్నామని సూసైడ్‌నోట్ రాసి ఫేస్బుక్లో పెట్టారు. ఇండియాలోనే మొట్టమొదట మదనపల్లె బర్మావీధిలో నిర్మించిన సాయిబాబా ఆలయంలో ఊహ తెలిసినప్పటి నుంచి చిప్పిలికి చెందిన శివస్వామి ప్రధాన అర్చకుడిగా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆలయంలో బాబాతో తీసిన ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశార ు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు శివస్వామి ఇక మీదట బాబాకు అర్చకుడిగా ఉండరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేల బాబాకు సేవలందించాలంటే ఆలయ కమిటీ సభ్యుల పాదాలకు మొక్కాలని వేధించ సాగారు. ఈ విషయాన్ని జీర్ణీంచుకోలేని శివస్వామి బాబాకు సేవలందించిన తాను కమిటీ సభ్యుల పాదాలు పట్టుకోనని తేల్చిచెప్పారు. అప్పటి నుంచి శివస్వామి ఆలయానికి రాలేదు. శివస్వామే కాకుండా అతని భార్య జ్యోతి కూడా అదృశ్యం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీంతో శనివారం ఫేస్బుక్లో సూసైడ్‌నోట్ ఆధారంగా కుటుంబ సభ్యులు అత్త భ్రమరాంభ, టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ హనుమంతు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.