పుష్కరాలకు సహాయ నిరాకరణ
శివక్షేత్రం పీఠాధిపతి హెచ్చరిక
విజయవాడ(వన్‌టౌన్) : విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించకుంటే కృష్ణా పుష్కరాలకు రాజధాని పరిసరాల్లో సహాయ నిరాకరణ చేపడతామని శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హెచ్చరించారు. వన్‌టౌన్‌లోని కొత్తగుళ్లు ప్రాంగణంలో ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతీయ ధర్మానికి మూలమైన హైందవ సంప్రదాయాలను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో అర్ధరాత్రి అక్రమంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది హిందూమతంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం గూండా ల తరహా పాలన చేస్తోందని దుయ్యబట్టారు. దీనికి కారణమైన ఎంపీ తక్షణం రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆలయాలకు దాతలిచ్చిన భూముల్లో సత్రాలు నిర్మిస్తే ఆ ఆస్తులను ప్రభుత్వం అక్రమంగా విక్రయిస్తోందని ఆయన మండిపడ్డారు.
నేడు నిరసన ప్రదర్శన
ఆలయాల కూల్చివేతకు నిరసనగా ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు శివస్వామి ప్రకటించారు. 40 మంది పీఠాధిపతుల సారథ్యంలో ఈ ప్రదర్శన జరుగుతుందన్నారు.
మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు : సత్యానందభారతీస్వామి
గన్నవరం: రోడ్ల విస్తరణకోసం రాష్ట్రప్రభుత్వం ఆలయాల్ని ధ్వంసం చేయ డం రాష్ట్రానికే అరిష్టమని శ్రీభువనేశ్వరీ పీఠాధిపతి సత్యానందభారతీస్వామి పేర్కొన్నారు. ఆది వారం ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా 30కిపైగా దేవాలయాల్ని కూల్చివేయడం దారుణమన్నారు.