ప్రభుత్వం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. దేవాలయాల కూల్చివేతను నిరసిస్తూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యాన విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
టీడీపీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పది రోజులుగా శైవక్షేత్రంపై దాడులుచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటూ శైవక్షేత్రానికి రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని చెప్పారు. అధికారం ఉందికదా అని ఏం చేసినా ఫర్వాలేదని ఎమ్మెల్యే విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన హిందూ ధర్మపరిరక్షణకు వెనుకడుగు వేసిది లేదని తేల్చిచెప్పారు.
నెలరోజులు గడిచినా దేవాలయాల కూల్చివేతపై మఠాధిపతులు, పీఠాధిపతులకు మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వానికి మరో రెండు రోజులు గడువిస్తున్నామని, ఈలోగా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని శివస్వామి స్పష్టంచేశారు. శనివారం నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పుష్కరాలకు ఆధ్యాత్మిక సేవల సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు.