’ఆ పెళ్లికి డుమ్మా కొడితేనే మంచిది’
బెంగళూరు: దేశమంతా డబ్బు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా అంబరాన్నంటే సంబురంతో గాలి జనార్దన్ రెడ్డి జరిపిస్తున్న తన కుమార్తె వివాహానికి కొంతమంది బీజేపీ నేతలు డుమ్మాకొడుతున్నట్లు తెలిసింది. బీజేపీలో మాజీ మంత్రిగా పని చేసిన జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, రాజకీయ పెద్దలకు ఆహ్వానాలు పంపించారు.
అయితే, ఈ వివాహ కార్యక్రమానికి వెళ్లకుండా దూరంగా ఉండాలని బీజేపీ అగ్రనాయకత్వం తమ పార్టీకి చెందిన కొందరు నేతలకు అంతర్గతంగా సూచనలు చేసినట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఈ సూచనలు చేయనప్పటికీ ఆ వివాహానికి వెళ్లకుండా దూరంగా ఉంటేనే మంచిదని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేనందున గైర్హాజరు అయితే బాగుంటుందని చెప్పారట. కాగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఈ వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. కొంతమంది కేంద్రమంత్రులు గైర్హాజరయ్యే అవకాశం ఉంది.