పొగమంచులోనూ స్పష్టంగా..
విమానాలు, హెలికాప్టర్లు నడుపుతున్నప్పుడు పైలట్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. పొగమంచు, వర్షాలు, మేఘాల కారణంగా పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పరిసరాలు కనిపించకపోవడంతో ఎదురుగా ఏముంది, హెలికాప్టర్ ఎంత ఎత్తులో ఎగురుతోంది? ఇంకా ఎంత ఎత్తుకు ఎగిరితే బాగుంటుంది అన్నది పైలట్లు తేల్చుకునేలోపే నష్టం జరిగి పోతోంది. అందుకే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పైలట్లు పరిసరాలను చక్కగా అంచనా వేసేందుకు ఉపయోగపడే ఈ స్మార్ట్ కళ్లజోడును ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎల్బిట్ సిస్టమ్స్’ తయారు చేసింది. ‘స్కైలెన్స్’ అనే ఈ కళ్లజోడు ఓ హెడ్సెట్లో భాగంగా ఉంటుంది.
విమానం లేదా హెలికాప్టర్‌కు ముందువైపు అమర్చిన వీడియో కెమెరాలకు అనుసంధానమై ఇది పనిచేస్తుంది. పొగమంచు లేదా దట్టమైన మేఘాలు అలముకున్నా, ధూళి తుపాను రేగినా లేదా భారీ వర్షం కురుస్తున్నా ఈ కళ్లజోడు పరిసరాలను స్పష్టంగా చూపుతుందట. అలాగే హెలికాప్టర్ ఎంత ఎత్తులో, వేగంతో ఎగురుతోంది? చుట్టుపక్కల ఎత్తై కొండలు ఉన్నాయా? అన్నదీ తెలియజేస్తుంది. ఇతర విమానాలు లేదా హెలికాప్టర్లు దగ్గరగా వస్తే.. రాడార్ సిగ్నళ్ల సాయంతో ఇది పసిగట్టి హెచ్చరిస్తుంది కూడా. పొగమంచు, వర్షాలు, ధూళి అలముకున్న ప్రాంతాల్లో ఈ కళ్లజోడును ధరించి 150 మంది పైలట్లు ఐదు రకాల విమానాలు, హెలికాప్టర్లు నడిపి చూశారట. ఈ టెక్నాలజీని మరో రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని కంపెనీవారు వెల్లడించారు.