అభిమాని చెంప చెళ్లుమనిపించిన యూసుఫ్ పఠాన్
వడోదర: పేలవ ఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్.. మ్యాచ్ తిలకించేందుకు వచ్చిన ఓ క్రికెట్ అభిమానికి చెంపదెబ్బలు కొట్టాడు. జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
క్రికెట్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. రంజీ ట్రోఫీలో బరోడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూసుఫ్.. తెలుగుతేజం అంబటి రాయుడుతో కలసి బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఓ క్రికెట్ అభిమాని పరుష వ్యాఖ్యలు చేశాడు. యూసుఫ్‌తో పాటు ఇతర జట్టు సభ్యులను దూషించాడు. దీంతో సహనం కోల్పోయిన యూసుఫ్ అనంతరం.. ఆ ప్రేక్షకుడిని డ్రెస్సింగ్ రూమ్‌కు పిలిచి రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యూసుఫ్ సోదరుడు, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ చేరుకుని వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకుడి కుటుంబ సభ్యులు వచ్చి యూసుఫ్ కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మ్యాచ్ రిఫరీ బీసీసీఐకి నివేదిక పంపాడు.