పింక్ టెర్రరిజం.. సరికొత్త ఉగ్రవాదం!
ఇప్పటివరకు రకరకాల ఉగ్రవాదాలు చూశాం. కానీ ఇప్పుడో సరికొత్త ఉగ్రవాదం వస్తోందట. అక్రమంగా జంతువులను వధిస్తూ, వాటితో వచ్చే సొమ్మును ఉగ్రవాదానికి, బాంబుల తయారీకి కొంతమంది ఉపయోగిస్తున్నారని కేంద్ర మంత్రి మేనకాగాంధీ చెబుతున్నారు. దానికి ఆమె 'పింక్ టెర్రరిజం' అని పేరుపెట్టారు. పాలిచ్చే జంతువులను వధించడం భారతదేశంలో ఒక వ్యాపారంగా ఉందని, దీంతో వచ్చే సొమ్మును ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నప్పుడు, దీన్నెందుకు అనుమతిస్తున్నామని ఆమె ప్రశ్నించారు. చైనాలో కంటే ఎక్కువగా భారతదేశంలో జంతువులను వధిస్తున్నారని, పాలిచ్చే జంతువులను ఇలా అక్రమంగా వధిస్తూ, వాటిని బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని.. ఇందులో మతం ప్రసక్తి ఏమాత్రం లేదని, కేవలం డబ్బుకోసమే అంతా ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఎప్పటినుంచో జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న మేనకా గాంధీ, తాజాగా ఇండియా ఫర్ యానిమల్స్ అనే సదస్సులో మాట్లాడుతూ ఈ గులాబీ ఉగ్రవాదం గురించి ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు నాలుగేళ్ల క్రితమే దీనిగురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు. బంగ్లాదేశ్ ఒక్క దేశానికే మన వద్ద నుంచి అక్రమంగా ఏటా 1.60 లక్షల టన్నుల ఆవుమాంసం పంపుతున్నామని, వాళ్లకు ఒక్క ఆవు కూడా లేదని ఆమె అన్నారు.
ఇలా, పాలిచ్చే జంతువులను వధించడం.. దానికితోడు ఆ డబ్బును ఉగ్రవాదానికి ఉపయోగించడం విశృంఖలంగా సాగుతున్నందున.. దీన్ని అడ్డుకోడానికి అందరూ కృషిచేయాలని, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మేనక పిలుపునిచ్చారు.