slipped in water
-
విషాదం నింపిన పుట్టినరోజు వేడుక
సాక్షి, తూర్పు గోదావరి : కాకినాడ పట్టణానికి సమీపంలో ఉన్న హంసవరంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు వారి పాలిట శాపంగా మారాయి. వివరాలు.. పృథ్వీ, హరీష్, మణికంఠలు ప్రాణస్నేహితులు. శుక్రవారం పృథ్వీ పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకొని కేక్ కట్ చేద్దామని పోలవరం కాలువ వద్దకు వెళ్లారు. కేక్ కట్ చేసిన అనంతరం కాలువలో సరదాగా గడుపుదామని ముగ్గురు కాలువలో దిగారు. అయితే కాలువ లోతు బాగా ఉండడంతో వారు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని వెతికేందుకు కాలువలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. పుట్టినరోజు నాడు సరదాగా గడుపుదామని వచ్చిన ముగ్గురు స్నేహితులు విగతజీవులుగా మారడం అక్కడున్నవారందరిని కలచివేసింది. -
వేడినీళ్లలో పడి చిన్నారి మృతి
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్) : ఆభం శుభం తెలియని ఓ పసివాడు ఆడుకుంటూ వేడినీళ్లపైపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద సంఘటన అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండా గ్రామపంచాయితీ పరిధిలోని బాలునాయక్‌తండాలో నెలకొంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్–ముని దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అందులో చిన్న కుమారుడు ధరావత్ సాయికుమార్(4) స్నానం కోసం ఉడుకుతున్న వేడినీళ్లు మీద పడి మృతి చెందాడు. ఈ నెల 26న ఇంటి ముందు పొయిపై మరుగుతున్న వేడినీళ్లపై ఆడుకుంటూ అటూగా వెళ్లిన బాలుడు గిన్నెపై పడ్డాడు. దీంతో ఆ బాలుడుకి ఒంటిపై వేడినీళ్లు పడి చర్మం తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన తల్లిదండ్రులు ముందట హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయికుమార్ మృతి చెందడంతో తండాలో విషాదఛాయాలు అలుముకున్నాయి. నీన్నే చూస్తూ బతుకుతున్నం కొడుకా.....నాలుగేళ్లకే నూరేల్లు నిండాయా కొడుకా...ఇగ మేము ఎవరి కోసం బతకాలి బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది. -
ఆడుకోవడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి..
సాక్షి, చెన్నారావుపేట: చిన్నారులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ డీబీఎం–40 కాల్వలో పడి బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కాల్నాయక్తండాలో ఆదివారం చోటు చేసుకున్నది. ఇదే గ్రామానికి చెందిన గుగులోతుఈరు–భద్రమ్మ దంపతుల కుమారుడు గుగులోతు సాత్విక్(6) మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో పిల్లలు ఇంటి వద్దనే ఉన్నారు. కాల్నాయక్తండా మీదుగా ఎస్సారెస్పీ డీబీఎం–40 కాల్వలో ఆటలు ఆడుకుంటూ ప్రమాదశాత్తు అందులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండావాసులు గమనించి సాత్విక్ మృతదేహాన్ని బయటికి తీశారు. కుమారుడి మృతితో తల్లి దండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సర్పంచ్ బాదావత్ రజిత, వీరన్న నాయక్‌లు నివాళులు అర్పించి కటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
నీటి గుంతలో జారిపడి వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె గ్రామ పరిధిలో ఆర్టీపీపీకి వెళ్లే మార్గంలో ఉన్న నీటి గుంత వద్దకు కాళ్లకు అయిన మట్టిని కడుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పొరబాటున జారి గుంతలో పడి మతి చెందాడు. మృతుడి భార్య భువనేశ్వరి, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు ... ముద్దనూరు మండలం నల్లబల్లె గ్రామానికి చెందిన గుగ్గల సుదర్శనరెడ్డి(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య భువనేశ్వరి ఉన్నారు. ఇంటికి ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకునేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నల్లబల్లె గ్రామం నుంచి ప్రొద్దుటూరుకి సున్నపురాళ్లపల్లె మీదుగా బయలుదేరాడు. సున్నపురాళ్లపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే వంతెన కింద బురద నీరు ఉంది. ఆ బురద నీటిలో నుంచి అలాగే వెళ్లడంతో సుదర్శనరెడ్డి కాళ్లకు బురద అయింది. ఈ బురదను కడుక్కోవడానికి సమీపంలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదశాత్తు గుంతలోకి జారి పడ్డాడు. గుంత సుమారు పది అడుగుల లోతు ఉండడంతో ఈత రాక సుదర్శన్‌రెడ్డి మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఆ దారిన వెళుతున్న ప్రయాణికులు గుంతలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కలమల్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఆచూకి గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి భార్య భువనేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కలమల్ల హెడ్ కానిస్టేబుల్ గురుశేఖర్‌రెడ్డి తెలిపారు.