పుట్టిన రోజే తిరిగిరాని లోకాలకు..
కాలుజారి పడి విద్యార్థిని మృతి
కార్వేటినగరం: పుట్టిన రోజే ఓ విద్యార్థినికి నూరేళ్లు నిండాయి. మంచినీటి కోసం నడిచి వెళుతూ కాలుజారి పడి ఓ విద్యార్థిని గదిలోనే మంగళవారం మరణించింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మండలంలోని ఎంఎం. విలాసం పంచాయతీ ఒంటిల్లుకు చెందిన ఎం. నర్మద మెడిసిన్లో కోచింగ్ తీసుకునేందుకు విజయవాడకు వెళ్లింది. మంగళవారం ఉదయం తాగునీటి కోసం వెళ్లి కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. సహచర విద్యార్థినులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగానే మరణించినట్లు గ్రామంలోని ఆమె తల్లిదండ్రులు ఎం.సోములు,స్వర్ణలతకు సమాచారం అందించారు. దీంతో ఆ గ్రామం సోకసంద్రమైంది.
కష్టాలు తీరతాయనుకున్నామే...
కుమార్తె మరణ వార్త విన్న తల్లి స్వర్ణలత కుప్పకూలింది. ‘‘ఇద్దరు కూతుళ్లను కొడుకులుగా భావించి అల్లారుముద్దుగా పెంచాం. ఉద్యోగులుగా చూడాలనే ఆశలను అడియాశలయ్యాయి’’ అంటూ ఆమె రోదనలతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. పుట్టిన రోజు నా చిట్టి తల్లికి నూరేళ్లు నిండాయని తండ్రి సోములు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. నర్మద తోటి విద్యార్థినులు పుత్తూరు కళాశాల నుంచి వచ్చి తమ కళాశాలలో చదివిన నర్మద డాక్టర్ అవుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న తమకు విషాదం మిగిలిందన్నారు. చుట్టు పక్కల గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి నర్మద మృతదేహాన్ని చూసి, కన్నీటిపర్యంతమయ్యారు.
ఎమ్మెల్యే నారాయణస్వామి పరామర్శ
మెడిసిన్ చదవడానికి వెళ్లి మృతి చెందిన నర్మద(18) కుటుంబాన్ని గంగాధరనె ల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి బుధవారం పరామర్శించారు. నర్మద మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె తండ్రి సోములును ఓదార్చారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ సింగిల్విండో అధ్యక్షుడు వి. గీత లోకనాథరెడ్డి, డెరైక్టర్ ఏకాంబరం, సర్పంచ్లు పష్పమునికృష్ణ, అమీద్, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ప్రభాకరరెడ్డి నర్మదకు నివాళులు అర్పించారు.