చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం
మెదక్‌టౌన్: చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందించేందుకు ఆగస్టు 1నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా బ్యాంకు మెదక్-నిజామాబాద్ జిల్లాల జోనల్ మేనేజర్ రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైస్ మిల్లర్స్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపించడం జరిగిందన్నారు. రూ.2.51 లక్షల కోట్ల వ్యాపారంతో 28 రాష్ట్రాలతోపాటు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంధ్రాబ్యాంకు తన సేవలను అందిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 482 బ్రాంచ్‌లతో రూ.65కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. జోన్ పరిధిలోని వ్యవసాయానికి రూ.840 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.630 కోట్లు అందించినట్లు తెలిపారు. బ్యాంకు ఎల్లప్పుడు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రాబ్యాంకు తనవంతు సేవలందిస్తుందన్నారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంకు మేనేజర్లు మల్లికార్జున, రఘు ప్రసాద్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.