'చిల్లర' గల్లంతు!
రూపాయి రూపాయి నువ్వేంచేస్తావ్ అని అడిగితే.. హరిచంద్రుడి చేత అబద్దం ఆడిస్తా. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా. అన్న తమ్ముల మధ్య వైరం పెంచుతా అందట. నిజంగానే రూపాయి చిచ్చు రేపుతోంది. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రూపాయి కోసం గొడవలే. డబ్బుపై మోజుతో జనం కొట్టుకుంటున్నారని పొరబడకండి. చిల్లర పైసలు కరువు రావడంతో జనం వాటి కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. చెలామణిలో ఉన్న నాణాలు ఏమైపోతున్నాయన్న అనుమానం కలుగుతోంది.
నాణెల కొరతతో దేశంలో 'చిల్లర' గొడవలు ఎక్కువవుతున్నాయి. సామాన్యులను 'చిల్లర' సమస్య సతమతం చేస్తోంది. నాణెల కొరత నిత్యం గొడవలకు దారి తీస్తోంది. కొనుగోళ్లు-అమ్మకాలు, ప్రయాణాలు-వ్యవహారాల్లో చిల్లర సమస్య తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వినియోగదారులు, వర్తకులు, సామాన్యులను చిల్లర కొరత కుదేలు చేస్తోంది. 50 పైసలు, రూపాయి, 2, 5 రూపాయిల నాణెలు తరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర సమస్యతో రోజువారీ జీవితంలో తలనొప్పులు తప్పడం లేదు.
గత కొద్ది నెలలుగా వేధిస్తున్న చిల్లర మాంద్యం అన్ని వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది. నాణెలు లభ్యత తగ్గిపోవడంతో రోజువారీ వ్యవహారాలు, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సన్నకారు వర్తకులు, నిత్యం ప్రయాణాలు చేసే వారిని చిల్లర సమస్య వెంటాడుతోంది. వందకు చిల్లర కావాలంటే 10 రూపాయిలు సమర్పించుకోవాల్సి వస్తోంది. నాణెల తయారీని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తగ్గించేయడం ఈ సమస్యకు ప్రధాన కారణం. చాలా మంది తమ దగ్గరే ఎక్కువ నాణెలు ఉంచుకోవడం కూడా చిల్లర లోటుకు దారితీస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాణెలు అరుదైన వస్తువుల జాబితాలో చేరడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నాణెల పంపిణీని రిజర్వు బ్యాంకు పక్కాగా అమలు చేస్తే చిల్లర సమస్య పరిష్కారమవుతుంది. చిల్లర గల్లంతు కాకుండా చర్యలు చేపట్టాలి. కాయిన్స్ ఏటీఎంలు పెట్టి చిల్లర లోటును భర్తీ చేయాలి. డిమాండ్‌కు అనుగుణంగా నాణెల తయారీ చేపడితే 'చిల్లర' గొడవలు సద్దుమణుగుతాయి. జనానికి తిప్పలు తప్పుతాయి.