స్మార్ట్ ఏపీ.. మా విధానం-నినాదం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ టౌన్.. స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసి.. రాష్ట్రాన్ని స్మార్ట్ ఏపీగా తీర్చిదిద్దుతా.. స్మార్ట్ ఏపీనే ప్రభుత్వ విధానం.. నినాదం’ అని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుపతిలో గురువారం దక్షిణ భారత ‘సీఐఐ సమ్ ఇన్ఫ్రా’ మూడు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రంగాల్లోనూ స్వయంసమృద్ధి సాధించేలా నగరాలను అభివృద్ధి చేయడానికే ప్రధాని నరేంద్రమోదీ స్మార్ట్ సిటీల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారన్నారు.
ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచించామన్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రాజధాని లేదనే సమస్య నుంచే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నగరాన్ని నిర్మించడానికి ప్రణాళిక రూపొందించడానికి దారితీసిందన్నారు. పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతి, ల్యాండ్ పూలింగ్ వంటి విధానాలతో రాజధానిని నిర్మిస్తుండటం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోందన్నారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
దేశంలో 2050 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెడతామన్నారు. రాష్ట్రంలో జల, వాయు, ఉపరితల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఏ రాష్ట్రానికీ లేని రీతిలో రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం ఉందన్నారు. రాష్ట్రంలో ఐదు పోర్టులే ఉన్నాయని.. మరో పది పోర్టులు నిర్మించి.. దేశానికి గేట్ వేగా మార్చుతామన్నారు. పోర్టులను కలుపుతూ తడ నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రతీరం వెంబడి బీచ్ రోడ్డును నిర్మిస్తామన్నారు.
ఈ రోడ్డును ప్రతి పది కి.మీ.లకు ఒక చోట జాతీయ, రాష్ట్ర రహదారులను కలిపేలా లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాకినాడ-పాండిచ్చేరి, కాకినాడ-శ్రీకాకుళం, బకింగ్‌హామ్ కెనాల్ వం టి జలమార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. విభజన బిల్లులో తిరుపతి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వాటిని అనుసంధానం చేస్తూ శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు వంటి ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలను ఏర్పాటుచేస్తామన్నారు.
ప్రైవేటీకరిస్తే ప్రగతి...
దేశంలో ఓఎన్జీసీ, సెయిల్, గెయిల్ వంటి నవరత్న సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉండటం వల్లే అనుకున్న మేరకు ప్రగతి సాధించలేకపోతున్నాయన్నారు. వాటిని ప్రైవేటీకరిస్తే అద్భుతాలు సాధించడం ఖాయమన్నారు. రాబోయే యుగం సోలార్ విద్యుత్దేన్నారు. రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అవసరమైన అనుమతులు ఇప్పటికే పారి శ్రామికవేత్తలకు ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలు, 13 మెగా పుడ్ పార్క్‌లు, 20 ఇండస్ట్రియల్ సిటీలను అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం నుంచి ఎంపీపీ వరకూ ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎన్జీవోలు, ఇతర అధికార సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని.. అక్కడ ఉన్న వనరులను వినియోగించుకుని స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దే వరకూ వదిలేదిలేదన్నారు.
సమావేశంలో గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠీ మాట్లాడుతూ కాకినాడ-శ్రీకాకుళం, చెన్నై-నెల్లూరు, విజయవాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి పట్టణానికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి పీపీపీ పద్ధతిలో ప్రయత్నిస్తామన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఆర్పీ సింగ్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్‌ను అధికంగా ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు విద్యుత్‌రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీఐఐ రాష్ట్ర చైర్మన్ చిట్టూరి సురేష్, సీఐఐ వైస్ చైర్మన్ రామచంద్ర గల్లా, కేపీఎంజీ పార్టనర్ ఆర్.నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.