స్మార్ట్ కప్పు.. తాగేది గుట్టు విప్పు..
వాషింగ్టన్: మనం తాగే జ్యూస్లోనో, డ్రింక్లోనో ఎంత మొత్తంలో కేలరీలు ఉన్నాయో తెలిస్తే ఎంత బావుంటుంది. ఇదే ఆలోచనతో మార్క్ వన్ అనే అమెరికా కంపెనీ ఒక స్మార్ట్ కప్పు ‘వెసిల్’ను తయారుచేసింది. కప్పులో మనం ద్రవం పోసిన వెంటనే అది ఏమిటి, పరిమాణం ఎంత, పోషకవిలువలు ఏమిటి, రుచి ఎలాంటిది అనే వాటితో పాటు చక్కెర పరిమాణం కూడా ఈ కప్పులో ఉన్న సెన్సార్లు గుర్తించి వెంటనే కప్పుపైనే ప్రదర్శిస్తాయి. అంతేగాక దీనికి అనుసంధానించిన మొబైల్ యాప్..
మన శరీరంలో ప్రొటీన్, కెఫీన్ల స్థాయి ఎంత ఉందో, ఏ మాత్రం పరిమాణం తీసుకోవాలో కూడా చెబుతుందట. నిర్దేశిత సమయంలో మన శరీరంలో కేలరీలు ఎంత ఖర్చు అయ్యాయో కూడా మన స్మార్ట్ కప్పు చెప్పేస్తుందట. మన ఫిట్నెస్ను కంట్రోల్లో పెట్టే ఈ కప్పు నిజంగానే సూపర్ స్మార్ట్ కదా. అందుకే దీనిని మార్కెటింగ్ చేయడానికి ఆ కంపెనీ సీఈఓ జస్టిన్ లీ ఫిట్నెస్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మార్కెట్లోకి వచ్చే సరికి స్మార్ట్ కప్పు ఖరీదు రూ. 12 వేలు ఉండొచ్చని అంచనా.