చూస్తూ... చదువుకోవచ్చు
⇒ స్మార్టర్ త్రీడీతో అందుబాటులోకి
⇒ హైదరాబాద్‌లో 25 స్కూళ్లలో బోధన
⇒ యూఎస్, యూకే సహా విదేశాల్లోనూ
⇒ సర్కారీ స్కూళ్లకు ఉచితంగానే ఇస్తామంటున్న హైదరాబాద్ స్టార్టప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్‌బోర్డ్-చాక్‌పీస్‌కు అలవాటు పడ్డ క్లాస్ రూమ్... కొన్నాళ్ల కిందటే ఎల్సీడీ స్క్రీన్కు మళ్లింది.
అయితే కంప్యూటర్ సాయంతో విద్యా బోధన చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లు భారీ ఫీజుల్ని వసూలు చేస్తుండటంతో దాన్ని చౌకగా మొబైల్‌కు మళ్లించాడు నీరజ్ జువెల్కర్. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్న ఈ హైదరాబాదీ... ఇందుకోసమే SMARTUR3D.COM ను ఆరంభించాడు. ప్రయోగాత్మకంగా చెబితేనే పాఠాలు అర్థమవుతాయనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఏవియేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో శిక్షణకు వినియోగిస్తున్న అగ్మెంటెడ్ రియాలిటీని తన సాఫ్ట్వేర్ ద్వారా క్లాస్రూమ్కూ తీసుకొచ్చాడు. ఆ వివరాలు ఈ వారం ‘స్టార్టప్ డైరీ’లో... ఆయన మాటల్లోనే...
ప్రాక్టికల్‌గా చెబితేనే..
‘‘ఏదైనా ప్రాక్టికల్‌గా ఒక్కసారి చూపిస్తే ఆ దృశ్యం మదిలో నిక్షిప్తమైపోతుంది. అందుకే అగ్మెంటెడ్ రియాలిటీతో smartur3d.com ను రూపొందించాం. దీంతో ప్రతి అంశాన్నీ ప్రాక్టికల్‌గా తెలుసుకోవచ్చు. శరీరంలోని ప్రతి భాగాన్ని చూస్తూ, తాకుతూ.. క్షుణ్ణంగా అధ్యయనం చేయొచ్చు. ప్రస్తుతం 3 నుంచి 10వ తరగతి వరకు బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్‌లో, ఆ తర్వాత జాగ్రఫీతో పాటు అన్ని సబ్జెక్టుల్లోనూ రూపొందిస్తాం. ఈ సాఫ్ట్‌వేర్‌లో ప్రధానంగా ఇంటరాక్టివ్ త్రీడీ, అగ్మెంటెడ్ రియాలిటీ, స్టీరియో స్కోపిక్ త్రీడీ అనే మూడు విభాగాలుంటాయి.
ఏక కణ జీవి అమీబా నుంచి సూక్ష్మ జీవులు, క్రిమికీటకాలు, చెట్లు, జంతువులు, మనుషులు... ఇలా అన్ని జీవుల శరీరాల్లోని బాహ్య, అంతర్భాగాలు ఇంటరాక్టివ్ 3డీ రూపంలో ఉంటాయి. అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా అయితే టెక్నాలజీ సహాయంతో నేరుగా చేతుల్లోకి తీసుకొని చదువుకోవచ్చు. స్టీరియో స్కోపిక్ త్రీడీ ద్వారా అయితే గూగుల్ కళ్లద్దాలను పెట్టుకొని మన కళ్ల ముందు కదలాడుతున్నట్లు చూస్తూ, శరీర భాగాల లోపలికి వెళ్లి అధ్యయనం చేయొచ్చు. ఆడియో సైతం మనకు కావాల్సిన అంశాన్ని కావాల్సిన భాషలో రికార్డు చేసుకుంటే... అదే భాషలో వినొచ్చు. విద్యార్థుల పరిజ్ఞాన స్థాయి, తరగతులను బట్టి శరీర భాగాల్లోని కొన్ని పార్ట్‌లను తొలగిస్తూ కూడా బోధించవచ్చు.
హైదరాబాద్‌లో 25 పాఠశాలల్లో...
ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్, హెచ్‌పీఎస్, స్టాన్లీ వంటి 25 పాఠశాలల్లోనూ... ముంబై, బెంగళూరు, పుణేల్లోని 150 పాఠశాలల్లోను; యూకే, కెనడా, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లోని 600 పాఠశాలల్లోను ఈ సాఫ్ట్వేర్ ద్వారా బోధిస్తున్నారు. దీని కోసం నెలకు రూ.2,500 చెల్లిస్తే చాలు. కంప్యూటర్లో, ఆండ్రాయిడ్ మొైబె ల్స్‌లో ఎందులోనైనా వేసి... దాన్ని కావాల్సిన స్క్రీన్కు కనెక్ట్ చేసి సులభంగా విద్యార్థులకు బోధించవచ్చు.
తయారీకి మూడేళ్లు..
ఈ సాఫ్ట్వేర్ రూపొందించడానికి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, రాష్ట్ర స్థాయి విద్యా బోర్డులతో పాటు అన్ని దేశాల్లోని విద్యా వ్యవస్థలను అధ్యయనం చేశా. అన్ని సిలబస్‌లలో కామన్‌గా ఉన్న పాఠ్యాంశాలను తీసుకొని దీన్ని రూపొందించా. అందుకే దీని తయారీకి మూడేళ్లు పట్టింది. రూ.3 కోట్లు ఖర్చయింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా..
తెలంగాణలో 44 వేల పాఠశాలలున్నాయి. వీటిలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలు. మిగతావన్నీ ప్రయివేటువే. ప్రయివేటు స్కూళ్లకి కంప్యూటర్ల ద్వారా చదువులు చెప్పటం పెద్ద సమస్యేమీ కాదు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం ప్రోత్సహిస్తే రాష్ట్రంలోని సర్కారీ స్కూళ్లన్నిటికీ ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అందిస్తాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...