రిలయన్స్ క్యాపిటల్‌లో ఎస్‌ఎంటీబీకి వాటాలు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించే దిశగా తమ కంపెనీలో 2.77 శాతం వాటాలను జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయి ట్రస్ట్ బ్యాంక్ (ఎస్‌ఎంటీబీ)కి విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. షేరు ఒక్కింటికి రూ. 530 చొప్పున ఈ డీల్ విలువ రూ. 371 కోట్లని, ఏడాది లాకిన్ పీరియడ్ ఉంటుందని ఒక ప్రకటనలో వివరించింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతులు వస్తే ఎస్‌ఎంటీబీ వ్యూహాత్మక భాగస్వామిగా కొత్త బ్యాంకును ఏర్పాటు చేయగలమని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది.
రెండు దేశాల్లోని క్లయింట్లకు ఇరు కంపెనీలు సంయుక్తంగా సేవలు అందించనున్నట్లు సంస్థ సీఈవో శామ్ ఘోష్ తెలిపారు. జపాన్‌లో నాలుగో అతి పెద్ద గ్రూప్ అయిన ఎస్‌ఎంటీబీ సుమారు 682 బిలియన్ డాలర్ల అసెట్స్‌ను నిర్వహిస్తోంది. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌లో భాగంగా రిలయన్స్ క్యాపిటల్ ఉంది.