social rights
-
హిజ్రాల్ని అరెస్ట్ చేయవద్దు
సాక్షి,హైదరాబాద్: హిజ్రాలకు సంబంధించిన యూనక్ చట్టం ప్రకారం వారిని అరెస్టు లేదా విచారణలు చేయవద్దని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యూనక్ చట్టంలోని 1329 ఎఫ్‌లోని సెక్షన్ 4, 5ల్లో కొన్ని నిబంధనలు హిజ్రాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వస్తువులపై ముద్ర వేసినట్లుగా ఈ చట్ట ప్రకారం హిజ్రాలపై ముద్ర వేయడం మానవత్వానికే మచ్చ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. యూనక్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ హిజ్రాల సామాజిక హక్కుల ఉద్యమకారులు, హిజ్రాలైన వి.వసంత మోగ్లి సహా ముగ్గురు దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. యూనక్ (నపుంసకుత్వం) అనే పదాన్ని ప్రయోగించడమే హిజ్రాలను కించపరచడమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. కొత్త రాష్ట్రం వచ్చాక కూడా ఈ చట్టం అమలును కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ చెప్పారు. వాదనల అనంతరం ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
సామాజిక హక్కుల సాధనకు బస్సుయాత్ర
అనంతపురం అర్బన్ : అణగారిన, వెనుబడిన వర్గాల హక్కుల సాధన, చైతన్యం కోసం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి జిల్లాలో బస్సుయాత్ర సాగుతుందని వేదిక నాయకులు తెలిపారు. శనివారం స్థానిక బళ్లారి బైపాస్‌లోని వైభవ్ రెసిడెన్సీలో వేదిక జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. వేదిక గౌరవాధ్యక్షుడు ఎస్ఆర్ నాగభూషణం ఆధ్యక్షతన జరిగిన సామావేశంలో జిల్లా అధ్యక్షుడు డి.జగదీశ్ మాట్లాడారు. వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఈ నెల 26న శ్రీకాకుళం ఇచ్చాపురంలో ప్రారంభమైందన్నారు. మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో సాగుతుందన్నారు. 7న జిల్లా కేంద్రంలో ముగింపు సభ నిర్వహిస్తామన్నారు. యాత్రను, ముగింపు సభను జయప్రదం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు కృషి చేయాలన్నారు. సమావేశంలో నాయకులు మునిసిపల్ మాజీ చైర్మన్ నూర్ మహమ్మద్, కనగానపల్లి జెడ్పీటీసీ ఈశ్వరయ్య, ఖలీఖుల్లాఖాన్, ఎంఎస్‌రాజు, దేవళ్ల మురళీ, మైనుద్దీన్, బోరంపల్లి ఆంజనేయులు, పద్మావతి, జాఫర్, కేశవ్‌నాయక్, రాప్తాడు సర్పంచ్ ఆకుల వెంకటరాముడు పాల్గొన్నారు. 15 నుంచి నియోజవకర్గాల్లో సమావేశాలు : జిల్లాలో బస్సుయాత్ర విజయంతం చేసేందుకు ఈ నెల 15నుంచి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని వేదిక నాయకులు తెలిపారు. 15న రాయదుర్గం, కళ్యాణదుర్గంలోనూ, 16న మడకశిర, హిందూపురం, 17న ఉరవకొండ, గుంతకల్లు, 18న పుట్టపర్తి, ధర్మవరం, 19న తాడిపత్రి, శింగనమల, 20న పెనుకొండ, రాప్తాడు, 21న కదిరి, అనంతపురం నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమావేశం నిర్వహిస్తామన్నారు. -
అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోంది
హిందూపురం టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తూ అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోందని సామాజిక హక్కుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సామాజిక హక్కుల వేదిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక ఐఎంఏ హాలులో జిల్లా, రాష్ట్ర స్థాయి వివిధ కుల సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనాభాలో అధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు లేక, ప్రభుత్వ తోడ్పాటు లేక అణచివేతకు గురవుతున్నారన్నారు. అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ప్రభుత్వమే భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 17న అనంతపురంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ జగదీష్, జాతీయ వడ్డెర సంఘం నాయకులు జయంత్, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మధు, ఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరాములు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, మైనార్టీ రాష్ట్ర నాయకులు నదీమ్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు నాగభూషణం, నూర్‌మహ్మద్, సాలార్‌బాషా, వేదిక సభ్యులు జాఫర్, కాటమయ్య, ఆనంద్‌కుమార్, శ్రీరాములు, కష్ణానాయక్, సురేష్, దాదాపీర్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.