మట్టి కుంభకోణం రూ.150 కోట్లు
- వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ దుట్టా విమర్శ
- న్యాయ విచారణకు డిమాండ్
- ట్రెంచ్ పనులు అడ్డుకున్నారని అరెస్ట్
హనుమాన్ జంక్షన్ : నీరు-చెట్టు పథకం పేరుతో మట్టిని అక్రమంగా అమ్ముకున్నారని, గన్నవరం నియోజకవర్గ పరిధిలో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని వైఎస్సార్సీపీ వైద్యవిభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు విమర్శించారు. దీనిపై న్యాయవిచారణ చేపట్టాలని, అవినీతి జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం, కె.సీతారాంపురం గ్రామాల పరిధిలోని బాలయ్య చెరువుకు ఏకపక్షంగా ట్రెంచ్ వేయడాన్ని నిరసిస్తూ డాక్టర్ దుట్టా శుక్రవారం ఆ పనులను అడ్డుకున్నారు.
దీంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆయనను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, ఎంపీటీసీలు బేతాళ ప్రమీలారాణి, మంగలపాటి కమలకుమారి, వైఎస్సార్ సీపీ నేతలు చిన్నాల లక్ష్మీనారాయణ, వెలగపల్లి ప్రదీప్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దుట్టా విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికి లక్షా 50వేల ట్రక్కులు, టిప్పర్లతో చెరువు పూడిక మట్టి రియల్ ఎస్టేట్లకు తరలించారన్నారు.
ట్రక్కుకు రూ.400, టిప్పరుకు రూ.2,500 వరకు వసూలుచేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. మీటరు లోతు తవ్వాల్సిన చెరువులను మూడు నుంచి ఆరు మీటర్ల వరకు తవ్వి వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేదలు, మిలటరీ కోటాలో చెరువు భూమిని పొందిన వారికి ఎటువంటి హెచ్చరికలు, నోటీసులు లేకుండా తవ్వకాలు జరపడాన్ని ఖండించారు. వైఎస్సార్ సీపీ వారికి అండగా ఉంటుందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న కోడూరుపాడు, వీరవల్లి, వేలేరు గ్రామాల చెరువుల్లో నీరు-చెట్టు పథకాన్ని అమలు చేయకుండా నిరుపేదలు ఉన్న ప్రాంతాల్లో దారుణాలకు పాల్పడటం విచారకరమన్నారు.
నీరు-చెట్టు పథకం పేరుతో దోచుకుంటున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్ అంగీకరించి మట్టికి రూ.80 పైగా సొమ్ము వసూలుచేసిన వారి దగ్గర నుంచి నగదు వెనక్కి ఇప్పిస్తానని ప్రకటించడం గమనించాలని దుట్టా చెప్పారు. గుడివాడలో ఐదు ఎకరాల చెరువు మట్టికి ప్రభుత్వం వేలం నిర్వహిస్తే రూ.24 లక్షలకు పాడుకున్నారని తెలిపారు. నిబంధనలతో నిమిత్తం లేకుండా మట్టి తవ్వకాలు కొనసాగనిచ్చేది లేదని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.