soina gandhi
-
సోనియాకు ప్రజల కష్టాలు తెలియవు...
చింతలపాలెం (కొత్తవలస), న్యూస్‌లైన్: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి తెలుగు ప్రజల కష్టాలు తెలియవని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ ఆరోపించారు. పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రకు మద్దతుగా శ్రీనివాస్ సంఘీభావ యాత్ర శనివారం ప్రారంభించారు. చింతలపాలెం జంక్షన్ వద్ద 50 కార్లతో ప్రారంభమైన ఈ ర్యాలీని శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కొత్తవలస జంక్షన్‌కు చేరుకోగానే అక్కడ ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, పార్టీ నాయకురాలు షర్మిల యాత్రకు సంఘీభావంగానే ఈ ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియా రాష్ర్ట విభజనకు సిద్ధపడిందన్నారు. ఇటలీ నుంచి వచ్చిన ఆమెకు ప్రజల కష్టాలు తెలియవన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమైక్యాంధ్ర ద్రోహి అని, ఆయన జిల్లాకు వస్తే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చింతలపాలెంలో ప్రారంభించిన సంఘీభావ యాత్ర దేశపాత్రునిపాలెం, మంగలపాలెం కొత్తవలస జంక్షన్ మీదుగా రాజపాత్రునిపాలెం, గొల్లలపాలెం, చీడివలస, రామలింగపురం, ముసిరాం గ్రామాల మీదుగా సాగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు మేళాస్త్రి అప్పారావు, వై. మాధవరావు, నంబారు కిరణ్, బండి రమణ, అడిగర్ల సంతోష్, రాజు, లెంక వరహాలు, తదితరులు పాల్గొన్నారు. -
పోరాట ఫలితం.. తెలంగాణ
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం యాభైఆరేళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఆత్మకూరులో శనివారం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్గాల వెంకట్రాంరెడ్డి నేతృత్వంలో జరిగిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చిందన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది బూటకపు ఉద్యమమని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ విషయంలో స్పష్టతతోఉన్న బీజేపీకి లేనిబాధ సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్ గ్రూపునకు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌ల జాగకోసమే సీమాంధ్రుల పోరాటమని, వారికి డబ్బు బలముంటే తమకు గొంతు బలముందని చెప్పారు. ఆంటోని కమిటీకి చెప్పడానికి సీమాంధ్రుల వద్ద ఏ స్టేట్మెంటూ లేదన్నారు. డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ సమ్మారావు మాట్లాడుతూ చంద్రబాబు సన్నాయి నొక్కులు ఆపాలని హితవు పలికారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బక్క జడ్సన్, ఆత్మకూరు మార్కె కమిటీ చైర్మన్ పింగిలి వెంకటనర్సింహారెడ్డి,చిదిరాల సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, పైడి, సర్పంచ్ సామెల్, రాము, గౌతమ్, సారంగపాణి, సంపత్, శ్రీనివాస్, సతీష్‌కుమార్, అశోక్, జనార్దన్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదు వరంగల్ సిటీ : ఎవరు అడ్డుపడ్డా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఆగదు.. ఇటు సూర్యుడు అటు పొడిచినా సోనియా వెనుకంజ వేయరని మంత్రి బస్వరాజు సారయ్య ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండలోని సర్క్యుట్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతవాసులకు ఎవైనా సమస్యలుంటే అనుభవజ్ఞుడైన దిగ్విజయ్‌సింగ్‌కు చెప్పుకోవచ్చన్నారు. మీకేం కావాలో? మీ బాధలేంటో వివరించాలని కోరారు. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దీనిని సీఎం, పీసీసీ అధ్యక్షుడితో సహా అందరూ ఖండించాల్సిందేనన్నారు. అసాంఘిక శక్తులను అరికట్టాలని కోరారు. దేవుని దర్శనం కోసం వెళ్లిన వారిపై దాడులు చేయడం సిగ్గుచేట న్నారు. సమావేశంలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేకే రాష్ట్ర విభజన: ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి
దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి బుధవారం అనంతపురంలో ఆరోపించారు. గాంధీ పేరు పెట్టుకునే అర్హత సోనియాకు లేదని ఆయన అన్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు లేఖ ఆధారంగానే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందన్నారు. సీమాంద్రలోని ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిందేనని గుర్నాథ్రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే అనంతపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు బుధవారం మిన్నంటాయి. సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్ఆర్ సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్లో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నగరంలోని ఎస్కేయూలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఆంటోని కమిటీ గో బ్యాక్ అంటూ ఆంటోనీ సెల్ నెంబర్‌కు అనంతపురం జిల్లాలోని వేలాది మంది ఉపాధ్యాయులు వేల సంఖ్యలో మెసేజ్‌లు పంపారు. -
రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా
రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఆదివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్‌కు పంపించారు. అనంతరం ఆయన నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి నందమూరి తారకరామారావుకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ ప్రసంగిస్తూ... మనమంతా అన్నతమ్ములుగా కలిస ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరం అవుతుందన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్ఠిపూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో నెహ్రూ ప్రధానిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు కలపి పెళ్లి చేస్తే, ఆ ఇంటి కోడలు సోనియా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడాకాలు ఇస్తుందని హరికృష్ణ ఎద్దేవా చేశారు. గతంలో పాండవులు, కౌరవుల మధ్య శకుని వైరం సృష్టిస్తే, నేడు తెలంగాణ, సీమాంధ్రల మధ్య సోనియా, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న దుష్ట క్రీడలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు రాష్టంలో ఏమి జరగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఏలా అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. రాష్ట విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆయన ఈ సందర్భంగా నిలదిశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై కేంద్రం ఐదు కమిటీలను వేసిన సంగతిని ఈ సందర్బంగా హరికృష్ణ గుర్తు చేశారు.