సోనియాకు ప్రజల కష్టాలు తెలియవు...
Published Sun, Sep 8 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
చింతలపాలెం (కొత్తవలస), న్యూస్‌లైన్: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి తెలుగు ప్రజల కష్టాలు తెలియవని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ ఆరోపించారు. పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రకు మద్దతుగా శ్రీనివాస్ సంఘీభావ యాత్ర శనివారం ప్రారంభించారు. చింతలపాలెం జంక్షన్ వద్ద 50 కార్లతో ప్రారంభమైన ఈ ర్యాలీని శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కొత్తవలస జంక్షన్‌కు చేరుకోగానే అక్కడ ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, పార్టీ నాయకురాలు షర్మిల యాత్రకు సంఘీభావంగానే ఈ ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియా రాష్ర్ట విభజనకు సిద్ధపడిందన్నారు. ఇటలీ నుంచి వచ్చిన ఆమెకు ప్రజల కష్టాలు తెలియవన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమైక్యాంధ్ర ద్రోహి అని,
ఆయన జిల్లాకు వస్తే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చింతలపాలెంలో ప్రారంభించిన సంఘీభావ యాత్ర దేశపాత్రునిపాలెం, మంగలపాలెం కొత్తవలస జంక్షన్ మీదుగా రాజపాత్రునిపాలెం, గొల్లలపాలెం, చీడివలస, రామలింగపురం, ముసిరాం గ్రామాల మీదుగా సాగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు మేళాస్త్రి అప్పారావు, వై. మాధవరావు, నంబారు కిరణ్, బండి రమణ, అడిగర్ల సంతోష్, రాజు, లెంక వరహాలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement